Operation Sarp Vinas: జమ్మూ-కశ్మీర్‌లో ఈ మధ్య ఉగ్రవాదులదాడులు చాలా ఎక్కువయ్యాయి. గత నెల రోజులుగా అక్కడ పలు ప్రాంతాల్లో భారత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా టెర్రరిస్టులు రెచ్చిపోతూనే ఉన్నారు. భారత ఆర్మీయే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నారు. అందుకే ఇప్పుడు వారిని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించుకుంది ఇండియన్ ఆర్మీ. దీని కోసం ఇండియన్ ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టింది. 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 ను మొదలుపెట్టింది. ప్రధాని కార్యాలయం ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగస్వాములైన అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
రెండేళ్ళుగా ఉగ్రవాదులు భారత ఆర్మీ మీద దాడులు చేయడం ఎక్కువైంది. రెండేళ్ళల్లో ఇప్పటికి 48 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ దాడుల వెనుక ఉన్న కీలక ఉగ్రవాదుల లిస్ట్‌ను భారత ఆర్మీ అధికారులు రెడీ చేశారు. వారిని మట్టుబెట్టడానికే ఇప్పుడు ఆపరేషన్ సర్ప్ వినాశ్‌ను మొదలుపెట్టింది. దాంతో పాటూ కీలక ప్రాంతాల్లో 200 మంది స్నైపర్లు, 500 మంది పారాకమాండోలతో కలిసి 3000 మందితో అదనపు బలగాలను మోహరించింది. ఈ ఆపరేషన్‌లో భారత ఆర్మీ ఒక్కటే కాకుండా తర సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా పాల్గొంటున్నాయి. స్థానికులను కూడా ఇందులో భాగస్వాములుగా చేసి వారి ద్వారా ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నదీ తెలుసుకోవాలనుకుంటోంది భారత ఆర్మీ. కీలక ఉగ్రవాదులను హతమార్చడంతోపాటు, ఆహారం, ఆయుధాలు, ఆశ్రయం కల్పిస్తూ క్షేత్ర స్థాయిలో వారికి సహకరించే నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని మిలటరీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. జమ్ములోని డోడా, కఠువా, ఉధంపుర్, రాజౌరీ, పూంచ్, రియాసీల్లో కొనసాగుతోందని తెలిపారు.