వైఎస్ఆర్టీపీ నాయకురాలు షర్మిల ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసుకు చేరుకున్నారు. తన పార్టీ అయిన వైఎస్ఆర్టీపీ ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరారు. మొత్తం 30 మంది నేతలతో కలిసి ఆమె కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ షర్మిలకు అధిష్టానం ఏపీలోని కాంగ్రెస్ బాధ్యలను అప్పగించనుందని తెలుస్తోంది. పార్టీని విలీనం చేశాక ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరినందుకు ఆనందంగా ఉందన్నారు షర్మిల. నేను మా నాన్న వైఎస్ఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నానని చెప్పారు. అధిష్టానం ఏ బాధ్యతను అప్పగించినా నిబద్ధతతో పనిచేసేందుకు రెడీ గా ఉన్నానని చెప్పారు. వైఎస్ఆర్ జీవితాంతం కాంగ్రెస్ కోసం పని చేశారని అన్నారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది వైఎస్ఆర్ కల అని చెప్పారు షర్మిల. ఇక దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని షర్మిల కొనియాడారు. మణిపూర్‌లో 2 వేల చర్చిలను కూల్చిన ఘటన తనను కలిచి వేసిందని..సెక్యులర్ పార్టీ కేంద్రంలో లేనందు వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని షర్మిల చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకునేందుకు కూడా షర్మిల సిద్ధమైనట్లు సమాచారం. అయితే.. ఏపీ పీసీసీ బాధ్యతలు తీసుకోవాలంటే కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల కొన్ని షరతులు పెట్టినట్లు సమాచారం.ఆ షరతులకు అధిష్టానం సిద్ధమైతేనే ఏపీ బాధ్యతలు చేపడతానంటూ తేల్చి చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలన్నది షర్మిల ఫస్ట్ డిమాండ్ గా తెలుస్తోంది. వసరమైతేనే లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లాలని సూచించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ పార్టీతో వెళ్లాలి? అనేది నిర్ణయించాలని అధిష్టానానికి షర్మిల తెలిపినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇందుకు హైకమాండ్ కూడా ఓకే చెప్పడంతో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి షర్మిల ఓకే చెప్పినట్లు సమాచారం.