హమాస్ జరిపిన మెరుపు దాడులకు ప్రతికారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఈ దాడుల్లో వేలాది మంది సామన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పలు దేశాలు కూడా సామన్య ప్రజలు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పిందించింది. గాజాలో ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే, ప్రశాంతంగా జీవించాలంటే, హమాస్ ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో కచ్చితమైన సమాచారాన్ని తమకు చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు ఉగ్రవాదుల ఉనికిని చెప్పిన వారి వివరాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు చెప్పమని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఎక్స్‌లో పోస్టు చేసింది. అలాగే ఉగ్రవాదుల కదలికల గురించి చెప్పిన వారికి ప్రైజ్ మనీ కూడా అందిస్తామని తెలిపింది.
మీరు ప్రశాంతంగా జీవించాలి అని అనుకుంటే, మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని అనుకుంటే.. మానవతాదృక్పథంతో వెంటనే హమాస్ ఉగ్రవాదుల ఉనికిని, విలువైన సమాచారాన్ని మాకు చెప్పండి. మీ ప్రాంతంలోని హమాస్ చెరలో ఉన్న వారి వివరాలు తెలియజేయండి. మీకు, మీ ఇంటికి ఇజ్రాయెల్ రక్షణ కల్పించే బాధ్యతను తీసుకుంటుంది. అంతేకాదు ఉగ్రవాదుల వివరాలు అందిస్తే.. మీకు ప్రైజ్‌మనీ కూడా ఇస్తాం. ఎట్టిపరిస్థితుల్లో కూడా మీ వివరాలు బయటపెట్టమంటూ పేర్కొంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మాతో పంచుకోవడానికి 8619 నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పొచ్చని, లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ ద్వారా +972503957992 నెంబర్‌లో కాంటాక్ట్ అవ్వొచ్చని చెప్పింది.
Also read: ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన తల్లి.. కానీ చివరికి..
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హమాస్ చెరలో దాదాపు 200 మంది వరకు బందీలుగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ భీకర ప్రతిదాడులు కొనసాగిస్తోంది. అయితే హమాస్ ఉగ్రవాదులు సాధారణ ప్రజలను తమ రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఐడీఎఫ్ ఆరోపణలు చేస్తోంది. రాకెట్ దాడులు జరిగే అవకాశాలు ఉన్నచోట పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజల్ని మోహరిస్తున్నారని.. దీనివల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఇజ్రాయెల్ అంటోంది. సోమవారం నాడు ఇద్దరు ఇజ్రాయెల్ మహిళలను హమాస్ మిలిటెంట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ మహిళల ఆరోగ్య పరిస్థితి, మానవతా కారణాలను దృష్టిలో ఉంచుకొని విడిచిపెట్టామని హమాస్ మిలిటరీ విభాగం ప్రకటింటింది.