Maxwell: జీవిత పాఠాలు నేర్పిన మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌.. ఎలానో తెలుసుకోండి!

శక్తి నెరిగి గెలిచి తీరాలన్న‌ మ్యాక్స్‌వెల్‌ పట్టుదలకు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం సలామ్ చేస్తోంది. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో మ్యాక్స్‌వెల్‌ జీవిత పాఠాలు నేర్పాడు.

Maxwell: జీవిత పాఠాలు నేర్పిన మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌.. ఎలానో తెలుసుకోండి!
New Update

Glenn Maxwell: ఒక క్రికెట్‌ మ్యాచ్‌ జీవితాన్ని మార్చగలదంటే నమ్మగలరా? నిరాశ, నిరుత్సాహం, నిస్పృహలు మధ్య కొట్టుమిట్టాడుతున్న జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందంటే ఒప్పుకుంటారా? ఏమో.. అన్ని క్రికెట్‌ మ్యాచ్‌లు గురించి తెలియదు కానీ.. నిన్న(నవంబర్‌7) ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్‌ (Australia vs Afghanistan) మధ్య జరిగిన పోరును చివరి వరకు చూసిన ఏ ఒక్కరిని కదిలించినా వారి కళ్లలో ఏదో గొప్ప విషయాన్ని చూశామన్న ఆనందం.. ఆశ్చర్యం కనిపిస్తుంది. ఆసీస్‌ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(Glenn Maxwell) పోరాటతత్వం క్రికెట్‌ అభిమానుల గుండెలను రగిలించింది. జీవితమంటే అనుక్షణం, అనుదినం పోరాడాలి.. కిందపడిన ప్రతీసారి గొడకేసి కొట్టిన బంతిలా పైకిలేవాలి. ఓటములకు కుంగిపోకూడదు. పడి లేవటం.. చచ్చి బతకటం.. ఓడి గెలవటం.. ఇదే జీవితమంటే.. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌ చెబుతున్న పాఠం ఇదే..!


పోరాట యోధుడు:
'అదే పనిగా క్రికెట్ ఎందుకు చూస్తావ్‌.. చదువుకోవచ్చు కదా.. ఆ ఆటలో ఏముంది.. ఎందుకా పిచ్చి' అని అడిగిన వారికి చెప్పండి.. ఆట విలువలను నేర్పుతుందని.. అందుకే సచిన్ అంటాడు.. 'క్లాస్‌ రూమ్‌లో చెప్పని జీవిత పాఠాలు..ఆటలు నేర్పుతాయని..' మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌ చూసిన ప్రతీఒక్కరూ ఇప్పుడిదీ అంగీకరిస్తారు. జట్టు కష్టాల్లో ఉంది..
సముద్రలోతుల్లో మునిగిపోయి ఉంది.. ఎదురీదడం అసాధ్యంగానే కనిపించింది. ఓవైపు పసికూనలగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అఫ్ఘానిస్థాన్‌ ఇప్పటికే పెను భూకంపాలు సృష్టించింది. ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ లాంటి జట్లను మట్టికరిపించింది. ఆ జట్టులో ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. 91 పరుగులకే ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయింది. మరో 201 పరుగులు చేయాలి.. ఎలా..? ఇది ఎలా సాధ్యం..? అందరూ అసాధ్యమమే అన్నారు.. ప్రిడిక్షన్‌ రేటులో అఫ్ఘానిస్థాన్‌ గెలుస్తుందని 95శాతం అభిప్రాయపడ్డారు.. మిగిలిన 5శాతం మంది పోరాటాలపై నమ్మకం ఉన్నవారు కావొచ్చు.. లేకపోతే ఆస్ట్రేలియా అభిమానులై ఉండొచ్చు.. కానీ చివరకు ఆ 5శాతం మంది చెప్పిందే జరిగింది.. వాంఖడే స్డేడియంలో (Wankhede Stadium) అద్భుతం ఆవిష్కృతమైంది. 292 పరుగుల టార్గెట్‌లో మ్యాక్స్‌వెల్‌ ఒక్కడే 201 రన్స్ చేయడం ఊహకందని విషయం.


నొప్పిని భరిస్తూ..కుంటుతూ:
చిన్న నొప్పికి విలవిలలాడిపోతుంటాం.. అమ్మో.. అయ్యో అంటాం.. మ్యాక్స్‌వెల్‌ కూడా నొప్పిని భరించలేకపోయాడు.. గ్రౌండ్‌లోనే గిలగిలాకొట్టుకుంటూ కిందపడిపోయాడు.. ఏడ్చినంత పని చేశాడు. మ్యాక్స్‌వెల్‌ (Maxwell) ఇక క్రీజులో నిలపడడం అసాధ్యమనే అంతా భావించారు. 9వ నంబర్‌ ఆటగాడు జంపా ప్యాడ్స్‌ వేసుకొని గ్రౌండ్‌లోకి దిగేందుకు రెడీ అయ్యాడు కూడా. కానీ మ్యాక్స్‌వెల్‌ గ్రౌండ్‌ను వీడలేదు.. కొండంత లక్ష్యం కళ్లేదుట కనిపిస్తుంటే తన జట్టును ఒంటరి చేసి వెళ్లాలని అనుకోలేదు. నొప్పిని భరిస్తూనే ఆడాలని నిర్ణయించుకున్నాడు.. పైకి లేచాడు.. నడవలేని పరిస్థితి.. కుంటుతూనే పరుగులు తీశాడు.. టెక్నిక్‌ మిస్‌ చేయకుండానే బౌండరీలు బాదాడు. ఓవైపు భరించరాని నొప్పి వేధిస్తున్నా.. మ్యాక్స్‌వెల్ రివర్స్‌ స్వీప్‌లో సిక్స్‌ కొట్టాడంటే అతని కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ ఏ రేంజ్‌లో ఉన్నాయో ఊహించుకోవడం కూడా కష్టమే. అవతలి ఎండ్‌లో కెప్టెన్‌ కమ్మిన్స్‌కు అసలు తాను చూస్తుంది నిజమో కలో కూడా అర్థం కాలేదు. 18.3 ఓవర్లలో 91/7 నుంచి 46.5 ఓవర్లలో 293/7 వరకు సాగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అనుక్షణం మ్యాక్స్‌వెల్‌ పోరాటమే కనిపిస్తోంది. జట్టు గెలుపు కోసం ప్రాణం పెట్టి ఆడిన మ్యాక్సి.. శరీరంలోని ప్రతి రక్తకణాన్ని తన టీమ్‌ కోసమే ఉపయోగించాడు. శక్తి నెరిగి గెలిచి తీరాలన్న‌ మ్యాక్స్‌వెల్‌ పట్టుదలకు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం సలామ్ చేస్తోంది. మ్యాక్స్‌వెల్‌ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మోకాలి కింద గాయాన్ని తొక్కిపెట్టి జట్టును గెలిపించిన మ్యాక్స్‌వెల్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో జీవిత పాఠాలు నేర్పాడు.

Also Read: ఏం ఆడాడురా బాబూ…రికార్డులన్నీ క్యూలు కట్టాయి

#cricket #motivation #icc-world-cup-2023 #glenn-maxwell #australia-vs-afghanistan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి