ఓటర్లు చాలా తెలివైన వారంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నాగ్‌పూర్ లో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటర్లు ఎంతో తెలివైన వారు. వారికి తోచిందే చేస్తారు తప్ప..మనం చెప్పింది ఎప్పటికీ వారు చేయరు. ఓ సారి ఎన్నికల సమయంలో నేను ఓటర్లకు కేజీ చొప్పున మటన్ పంచిపెట్టాను. కానీ ఆ ఎన్నికల్లో నేను ఓడిపోయాను అంటూ చెప్పుకొచ్చారు.
ఓటర్లు ఎన్నికల్లో నిల్చున్న ప్రతి అభ్యర్థి దగ్గర వారికి కావాల్సినవి పుచ్చుకుంటారు..కానీ వారి మైండ్ లో ఉన్నవారికి మాత్రమే వారు ఓటు వేస్తారు. ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు చేసిన వారు, ఎక్కువ గిఫ్ట్లు పంచిన వారు మాత్రమే గెలుస్తారంటే నేను అసలు నమ్మను అని పేర్కొన్నారు.
అందుకే ఓటర్లను ప్రలోభ పెట్టే బదులు, ప్రజల దగ్గర నమ్మకాన్ని పెంచుకోవాలని గడ్కరీ అన్నారు. ఓటమి చాలా పాఠాలు నేర్పుతుందని ఆయన వివరించారు. కానీ ఏ ఓటమి కూడా చివరి వరకు ఉండదని పేర్కొన్నారు. జీవితం లో ఓటమి అంటే అది ఒక గొప్ప సలహాగా భావించవచ్చని వెల్లడించారు.
అంతేకాకుండా..ప్రజల దగ్గర ఏ నాయకుడైతే నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకుంటాడో అలాంటి నాయకుడికి కనీసం ఓ బ్యానర్ కూడా అవసరం లేకుండానే ఎన్నికల్లో గెలుస్తారని ఆయన తెలిపారు.