హైదరాబాద్ అబిడ్స్ లోని జగదీష్ మార్కెట్ (Hyderabad Jagadeesh Market) అంటే తక్కువ ధరకే అన్ని రకాల ఫోన్ల యాక్సెసరీలు దొరికే ప్రాంతంగా ఫేమస్ అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని అనేక మంది ఫోన్ యాక్ససరీలు, రిపేర్ కోసం అక్కడికే వెళ్తూ ఉంటారు. జిల్లాల ఉంచి కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే.. అలాంటి జగదీష్ మార్కెట్ లో ఓ డూప్లికేట్ దందా బయటపడింది. ఏకంగా డూప్లికేట్ యాపిల్ కంపెనీ ఐఫోన్ (Apple iPhone) యాక్సెసరీలను విక్రయిస్తున్న నలుగురు టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కారు. దీంతో వారి మోసాల గురించి విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అసెంబ్లీకి దగ్గరలో ఉన్న బస్ స్టాప్ చోరీ..ఎలా ఎత్తుకెళ్లారో తెలుసా?
ఈ రోజు దోమలగూడ పోలీస్ స్టేషన్ బృందంతో కలిసి అబిడ్స్ లోని జగదీష్ మార్కెట్‌లోని మూడు మొబైల్ షాపుల్లో, హిమాయత్ నగర్ లోని మరో మొబైల్ షాపులో పోలీసులు సోదాలు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయా షాపుల నిర్వాహకులు నకిలీ యాపిల్ కంపెనీ యాక్సిసరీలను వినియోగదారులకు అంటగడుతున్నట్లు సోదాల్లో తేలింది. వీరి వద్ద నకిలీ ఐఫోన్ ఇయర్ బర్డ్స్, అడాప్టర్, ఐఫోన్ బ్యాటరీలు, స్క్రీన్ కార్డులు, ఐ ఫోన్ బ్యాక్ కవర్, లోగోలు, చార్జింగ్ వైర్లను గుర్తించారు.
వాటిని జనాలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ వస్తువులు నకిలీవా? కాదా? అన్నది గుర్తు పట్టడం సాధ్యం కాని విధంగా ఉన్నాయని పోలీసులు తేల్చారు. అయితే.. కంపెనీలకు సంబంధించిన షోరూంలు, స్టోర్ లలో మాత్రమే యాక్ససరీలను కొనడం ద్వారా నకిలీ వాటికి అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.