కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరిగింది. సంప్రదాయాల్లో భాగంగా కర్రలు గాల్లోకి లేచాయి. డిర్ర్, గోపరాక్ అనే శబ్దాలతో దేవరగట్టు దద్దరిల్లింది. పోలీసులు వద్దని చెప్పినా వినలేదు.. యథావిధిగా కర్రల సమరం కొనసాగింది. దేవరగట్టుపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు భక్తిభావంతో ఆరాధిస్తారు. ఉత్సవాలకు ముందు వచ్చే అమావాస్య నుంచి నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు దీక్షలు చేపడతారు. ఉత్సవ విగ్రహాలకు కంకణధారణ చేసే గ్రామస్తులు బన్నీ ఉత్సవాలు ముగిసేంతవరకు ఎంతో నిష్టగా ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నెరిణికి గ్రామానికి చేరేంతవరకు మద్యం, మాంసం ముట్టరు. భార్యభర్తలు ఒకే మంచంపైన కూడా నిద్రపోరు. తరతరాలుగా ఈ ఆనవాయితీని పాటిస్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.
Also Read: 40ల్లో ఉన్నారా… హెవీ వర్కౌట్స్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.
విజయదశమి రోజు అర్ధరాత్రి మల్లేశ్వర స్వామికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నెరణికి, నెరణికితండా, కొత్తపేట, సులువాయి, ఆలూరు, బిలేహాలు, విరుపాపురం గ్రామాల ప్రజలు అర్ధరాత్రి వేళ కర్రలు చేతపట్టి దేవరగట్టుకు వచ్చారు. దైవకార్యాన్ని అందరం ఐకమత్యంగా జరుపుకొంటామని డోళ్లన బండ దగ్గర నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు పాలబాస చేశారు. ఆ తర్వాత పెద్దఎత్తున కేకలు వేస్తూ కొండపైకి చేరుకున్నారు. కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామికి మల్లమ్మతో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
తర్వాత ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా జైత్రయాత్రకు బయల్దేరారు. గట్టుపై నుంచి కిందకు వచ్చి సింహాసన కట్ట వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సమయంలోనే నెరణికి, కొత్తపేట, నెరణికితండా, బిలేహాల్, ఆలూరు, ఎల్లార్తి, సుళువాయి గ్రామాల మధ్య కర్రల సమరం జరిగింది. దీన్నే బన్ని ఉత్సవం అంటారు. ఇందులో 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు బన్నీ ఉత్సవాన్ని చూసేందుకు కొందరు స్థానికులు దగ్గరలోని చెట్టు ఎక్కారు. దీంతో చెట్టు కొమ్మ విరిగి పడి ఒకరు చనిపోయారు.. పలువురికి గాయాలు అయ్యాయి.
ఈ దేవరగట్టు కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చేసిన ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. కర్రల సమరం వద్దని అవగాహన సదస్సులు నిర్వహించినా.. భక్తులు వినలేదు. తమ సంప్రదాయాలు, ఆనవాయితీనే ముఖ్యం అనుకున్నారు గ్రామస్థులు. కర్రల సమరాన్ని ఆపలేకపోయారు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్నూలు ఎస్పీ జి.కృష్ణకాంత్ నేతృత్వంలో వెయ్యి మంది పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.