High Tension in Yuvagalam Padayatra: ఏలూరు జిల్లా నూజివీడులో జరుగుతున్న టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా సైకో పోవాలి సైకిల్ రావాలి పాటను టీడీపీ నేతలు ప్లే చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలు ఆ పాట వెంటనే ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు బైక్‌లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రస్తుతం 194వ రోజు పాదయాత్ర నూజివీడు నియోజకవర్గంలో సాగుతోంది. నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు గ్రామ దళితులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని వాపోయారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదని తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.
గురువారం లోకేష్ పాదయాత్రం గన్నవరం నియోజవర్గంలో సాగుతున్న సందర్భంలోనూ వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫొటోలతో వైసీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పాదయాత్ర రంగన్నగూడెం వద్దకు రాగానే బ్యానర్ వద్ద నిలబడి వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదుచేయడానికి వెళ్లిన సయయంలోనూ వీరవల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Also Read: టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం