Heavy rains in Telugu states: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో(Bay of Bengal) అల్పపీనడం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగినట్టు ఐఎండీ(IMD) ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారినట్టు తెలిపింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీనడం కేంద్రీకృతమైంది. అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణకు హై అలర్ట్:
తెలంగాణలో కుండపోతక కారణంగా 11 జిల్లాలకు రెడ్ అలర్ట్(Red alert) జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ(సెప్టెంబర్ 5) తెల్లవారు జామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటల్లోనే 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షానికి జలమయమై ట్రాఫిక్ స్తంభించింది. రోజంతా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. భారీ వర్షాల సమయంలో నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. సమస్యలు ఉన్నవారు 040-21111111కు ఫోన్ చేయవచ్చు. మరోవైపు వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Also Read: తెలంగాణలో మరో ఐదురోజులు వానలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
ఏపీలోనూ భారీ వర్షాలు:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఏపీ, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇటు ప్రకాశం, నంద్యాల, కర్నూలు, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ వాగులో కూరగాయల వ్యాపారి షేక్ మహ్మద్ ఖాసీం నీట మునిగి మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న 42 ఏళ్ల ఖాసీం ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నిస్తుండగా కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న గిద్దలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగించాయి.
ALSO READ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం.. రెండు గంటలు దంచిపడేసింది!