Heavy Rain Alert for Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కరిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న అల్పపీడన ద్రోణి కోస్తా భాగాలపై కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని వలన దక్షిణ కోస్తా ఏపీలోనూ బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మరికొన్ని ప్రాంతాల్లో గాలులు వేగంగా వీస్తాయని తెలిపారు. రాయలసీమలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు.
ఈరోజు పార్వతీ పురం, మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, నెల్లూరు, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. కాగా మంగళ వారం.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడ్డాయి.
ఇక హిమాచల్ ప్రదేశ్ లో ఆగష్టు 22 నుంచి 24 వరకు 115.6 నుంచి 20.4 మిల్లీ మీటర్ల వరకు భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత వాతావరణ శాఖ సూచన ప్రకారం.. కాంగ్రా, చంబా, హమీర్‌పూర్, మండి బిలాస్ పూర్, సోలన్, సిమ్లా లతో పాటు కులు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రోజు కొండ ప్రాంతాలలో చాలా చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
కొండ చరియలు విరిగిపడటం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలోని అన్ని విద్యా సంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించారు అధికారులు. అలాగే వర్షాల కారణంగా సిమ్లా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు, అంగన్ వాడీల సెంటర్లకు రెండు రోజుల పాటు అధికారులు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం అత్యంత భారీ వర్షపాతం కారణంగా, భద్రతా కారణాల దృష్ట్యా పర్వానూ సమీపంలోని చక్కి మోడ్ వద్ ట్రాఫిక్ ను నిలిపివేశారు అధికారులు. రద్దీని నివారించడానికి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
Also Read: తిరుమలలో చిరుత కదలికలకు కారణం అదే: పీసీఎఫ్ నాగేశ్వర రావు