తేజ సజ్ఞా హీరోగా నటించిన హనుమాన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూభారీ వసూళ్ల దిశగా సాగుతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమా అయినప్పటికీ హనుమాన్ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా నార్త్ సర్కిల్స్ లో హనుమాన్ హిందీ, తెలుగు వర్షన్ లు సంచలన వసూళ్లు రాబడుతున్నాయి. ఈ మేరకు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సినీ క్రిటిక్ అయిన తరణ్ ఆదర్శ్ ఈ సినిమా సరికొత్త రికార్డు నమోదు చేసిందంటూ ట్వీట్ చేశారు. హనుమాన్ మొదటి మూడు రోజుల ఓపెనింగ్స్ కేజీఎఫ్ పార్ట్-1, కాంతార వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయని దాదాపు పుష్ప సినిమాతో సమానంగా ఈ సినిమా వసూళ్లు రాబడుతోందంటూ ట్వీట్ చేశారు.
ఈ ఏడాదిలో ప్రారంభంలోనే తొలివిజయం అందుకున్న సినిమాగా హనుమాన్ నిలిచిందని, ఓపెనింగ్ తో పాటు వీకెండ్ కూడా అద్భుతంగా ఉండడంతో రానున్న రోజుల్లో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇక హనుమాన్ హిందీ వర్షన్ వసూళ్లు శుక్రవారం నాడు 2 కోట్ల 15 లక్షలుంటే, శనివారం 4 కోట్ల 5 లక్షలు, ఆదివారం 6 కోట్ల 6 లక్షలు కలిపి మొత్తం హిందీలో ఇప్పటివరకు 12 కోట్ల 26 లక్షల దాకా వసూలు చేసింది. ఇక నార్త్ ఇండియాలో రిలీజయిన తెలుగు వర్షన్ శుక్రవారం 24 లక్షలు, శనివారం 40 లక్షల, ఆదివారం 45 లక్షలు, మొత్తం కలిపి కోటి 9 లక్షల రూపాయలు వసూలు చేసింది. జనవరి 25 వరకు సాలిడ్ రిలీజ్ ఏదీ లేకపోవడంతో హనుమాన్ మరిన్ని రికార్డులు బద్దలు కొడుతూ సంచలన వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని సినీ క్రిటిక్ లు అభిప్రాయ పడుతున్నారు.