/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-5-1.png)
గల్ఫ్‌కు చెందిన ఎన్నారైలు శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ ఆపదలో ఉన్న రైతులకు అండగా ఉండి, వారికి తన వంతు ఆర్థిక సహాయం అందిస్తుండంతో మేము సైతం అని ముందుకు వచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యుల సారధ్యంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన. అలమూరు ఎన్నారైలు పవన్ కళ్యాణ్‌కు కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు గల్ఫ్ యూనిట్ కోఆర్డినేటర్ రాయుడు వెంకటేశ్వరరావు పవన్ కళ్యాణ్‌కు కోటి రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ విరాళాన్ని కువైట్, మస్కట్, ఖతార్, బెహరిన్, సౌదీ అరేబియా దేశాల్లో ఉన్న జనసేన పార్టీ అభిమానులు సేకరించారన్నారు.
ఏపీలో ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు లేవని రాయుడు వెంకటేశ్వరరావు అన్నారు. అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఎదురైతే, చెప్పుకోవడానికి తెలిసిన పోలీసు అధికారైనా ఉండాలి లేదా సొంత కులానికి చెందినవాడు ఎమ్మెల్యే అయినా ఉండాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం నుంచి కౌన్సిలర్ స్థాయి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరూ బెదిరించేవారేనని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో బతకగలిగిన మనం ఇక్కడ ఎందుకు బతకలేకపోతున్నామని పవన్ ప్రశ్నించారు.
ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మద్యం నుంచి ఇసుక వరకు ప్రతీ ఒక్కటీ దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. జగన్ పాలనలో ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మార్పులు రావాలని, అవి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రారంభం కావాలన్నారు. అవినీతి రహిత రాజకీయాలే తన లక్ష్యమన్న పవన్.. ప్రజలు తనకు సహకరిస్తే తాను రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే తానేంటో నిరూపిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.