Hyderabad New Metro Routes: హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రతిపాదనలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. మెట్రో సెకండ్ ఫేస్ ప్రతిపాదనలపై డీపీఆర్, ట్రాఫిక్ అధ్యయనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో మూడు రూట్లలో మరికొన్ని నెలల్లో మెట్రో పరుగులు తీయనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ALSO READ: తెలంగాణలో 26మంది ఐఏఎస్ ల బదిలీలు..
గ్రీన్ మెట్రో లైన్.. పాతబస్తీలో మెట్రో పరుగులు
గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిలిపివేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రూ.6250 కోట్లతో 39 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గానికి బదులు ఎంజీబీఎస్ (MGBS), ఎల్బీనగర్ (LB Nagar) నుంచి మెట్రో కనెక్టివిటీ ఉండనుంది. ఇప్పటికే జేబీఎస్-ఎంజీబీఎస్ మధ్య మెట్రో గ్రీన్ లైన్ ఉంది. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా-చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి-పీ7 రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు వరకూ విస్తరణ చేయనుంది. 23 కిలోమీటర్ల మేర విస్తరణ జరగనుంది. దీనికి అంచనా వ్యయం రూ. 3680 కోట్లు అని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా ఎయిర్‌పోర్టు (Airport) వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. పాతబస్తీ వాసులకు అందుబాటులోకి మెట్రో సేవలు రానున్నాయి.
బ్లూ మెట్రో లైన్.. రాయదుర్గం టూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
ఇప్పటికే నాగోల్-రాయదుర్గం మధ్య మెట్రో సేవలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. నాగోల్-రాయదుర్గం మధ్య 28 కిలోమీటర్ల మేర మెట్రే లైన్ ఉంది. మరో 12 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (Financial District) వరకూ 12 కిలోమీటర్ల విస్తరణ చేసేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకూ అంచనా వ్యయం రూ. 1920 కోట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. ఐటీ కారిడార్ మీదుగా మెట్రో నిర్మాణం జరగనుంది. మెట్రో విస్తిరణతో ఐటీ సంస్థల్లోని ఉద్యోగస్థులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ALSO READ: రేవంత్ సర్కార్ నిర్ణయం.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్?
వైలెట్ లైన్.. రెడ్‌లైన్, బ్లూలైన్ మధ్య కనెక్టివిటీ
రెడ్‌లైన్, బ్లూలైన్ మధ్య కనెక్టివిటీ ఉంచేందుకు వైలెట్ మెట్రో లైన్ (Violet Line) ఏర్పాటు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎల్బీనగర్‌ను కనెక్ట్ చేస్తూ నాగోల్ నుంచి రాజేంద్రనగర్‌లోని హైకోర్టు కొత్త భవనం వరకూ మెట్రో విస్తరణ జరగనుంది. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఒవైసీ ఆసుపత్రి, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరంఘర్ మీదుగా హైకోర్టు కొత్త భవనం వరకూ మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 19 కిలోమీటర్లకు అంచనా వ్యయం రూ.3040 కోట్లు గా ఉంది. నాగోల్-రాజేంద్రనగర్ మధ్య DRDO, DRDL సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఈ మెట్రో కనెక్ట్ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సాధారణ పౌరులకు ప్రయోజనం కలగనుంది. ఆరంఘర్ జంక్షన్ మీదుగా మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే కర్నూలు, తిరుపతి, బెంగళూరు సహా పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.