Kurnool Student Nirmala: నిర్మల..కేజీబీవీలో బైపీసీ ఫస్ట్ ఇయర్ చదవుతోంది. ఈ విద్యార్థిని గత ఏడాది బాల్య వివాహం నుంచి బయటపడింది. ఇంట్లో తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే నిర్మలకు వివాహం చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు నిర్మలపై ఒత్తిడి తీసుకువచ్చారు. కానీ నిర్మల మాత్రం తన భవిష్యత్ గురించి ఆలోచించింది. ఎలాగైనా ఈ బాల్యం వివాహం నుంచి బయటపడాలని అధికారులను ఆశ్రయించింది. దీంతో కేజీబీవీలో అడ్మిషన్ పొందింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో టాపర్ గా నిలిచి సత్తా చాటింది నిర్మల.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..కర్నూలు జిల్లాలోని పెద్ద హరివనం గ్రామంలో జన్మించింది నిర్మల. గత ఏడాది జరిగిన ఏపీ టెన్త్ రిజల్ట్స్ లోనూ 537 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కానీ అప్పటికే తమ ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసిన నిరుపేద తల్లిదండ్రులు, ఆమెకు కూడా పెళ్లి చేయాలని భావించారు. నిర్మలకు కూడా పెళ్లి చేసేందుకు సంబంధాలు చూశారు. తమకు చదవించే స్థోమత లేదని..సమీపంలోఇంటర్ కాలేజీ కూడా లేదని కుమార్తెను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ నిర్మల మాత్రం తన భవిష్యత్తు గురించి ఆలోచించింది. గత ఏడాది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డిని సంప్రదించి జీవితంలో తన లక్ష్యాలను సాధించడంలో సహాయం చేయమని కోరింది.
బాలిక పరిస్థితిని చూసి చలించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ విషయాన్ని తెలియజేశారు. ఆమె జోక్యం చేసుకుని ముందుగా నిర్మలను బాల్య వివాహం నుంచి కాపాడి..ఆలూరులోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో చేర్పించారు. బైపీసీ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ తీసుకున్న నిర్మల..ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో 440 మార్కులకు 421 మార్కులను సాధించి టాపర్ గా నిలిచింది.
ఇది కూడా చదవండి: వెండి నాణేలపై బాలరాముడు..త్వరలోనే మార్కెట్లోకి..!