Eatala Rajender: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక కొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తమ పార్టీ కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి అధైర్య పడవద్దని కార్యకర్తలకు హితవు పలికారు. ఈ క్రమంలో కార్యకర్తలను ఉద్దేశిస్తూ ట్విట్టర్(X)లో ట్వీట్ చేశారు.
ALSO READ: Movierulz, iBOMMA లో సినిమాలు చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
ఈటల రాజేందర్ ట్విట్టర్ లో.. 'భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ ప్రతి నాయకునికి, కార్యకర్తకి హృదయపూర్వక అభినందనలు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా 15 శాతం ఓట్లు 8 సీట్లు గెలిచాం. 19 సీట్లలో రెండవ స్థానంలో నిలిచాం.. దానిని స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలి. మనలని బలహీనపరచడానికి, అనైఖ్యత సృష్టించి లాభం పొందాలని చూస్తున్నారు. దయచేసి వాళ్ళ ట్రాప్ లో మనం పడవద్దు. మన లక్ష్యం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపించి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి అందించడం. ఆ దిశగా పనిచేద్దాం తప్ప సోషల్ మీడియాలో చిల్లరగాళ్ళ.. పిచ్చి పోస్టులకు నా అభిమానులు, కార్యకర్తలు స్పందించవద్దు అని మనవి.' అంటూ రాసుకొచ్చారు.
ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఈటల రాజేందర్. మాజీ సీఎం కేసీఆర్ ను ఎన్నికల్లో ఓడించేందుకు ఆయన పోటీ చేసిన గజ్వేల్ తో పాటు తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో కూడా పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయారు. అయితే, తాజాగా ఈటల రాజేందర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఈటల ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది.
ALSO READ: పోస్టుమార్టంలో యువతి ‘కళ్లు’ మాయం.. కంగుతిన్న అధికారులు
ఇప్పుడు ఈటల రాజేందర్ ఎక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కరీంనగర్ నుంచి తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు నిజామాబాద్ నుంచి ఎంపీగా ధర్మపురి అర్వింద్ కూడా బరిలో దిగనున్నారు. దుబ్బాకలో ఓడిపోయినా రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈటల రాజేందర్ జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.