Badrachalam: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తుంది. భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయికి నీటిమట్టం చేరింది. భారీ వరదకు స్నానఘట్టాలు మునిగిపోయాయి. ప్రస్తుతం భద్రాచలం వద్ద 43 అడుగుల స్థాయికి నీటిమట్టం చేరింది. మరికాసేపట్లో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు 20 అడుగుల మేర గోదావరి నీటిమట్టం పెరిగింది.
48 అడుగుల వరకు భద్రావలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం అధికారుల అంచనా వేశారు. గోదావరి దిగువన శబరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శబరి పోటువేస్తే గోదావరి ప్రవాహం వేగం తగ్గి భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర జలసంఘం సూచనలతో జిల్లాయంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది.
ఛత్తీస్ ఘడ్ లో కుండపోత వర్షాలకు దిగువకు భారీగా వరద వచ్చి చేరుకుంటోంది. తాలిపేరుకు భారీగా ఇన్ ఫ్లో నమోదు కాగా.. ప్రాజెక్టు 24 గేట్లని అధికారులు ఎత్తివేశారు. ఇంద్రావతి నదికి ఇప్పటికే వరద భారీగా చేరుతోంది. ఈ ప్రభావంతోనే భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది.