Fire in Nallamala Forest:నల్లమల అడవుల్లో అగ్నికీలలు మరోసారి ఎగిసిపడ్డాయి. నల్లమల అడవుల్లో తరచు అగ్నిప్రమాదాలు అందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ లోని.. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్ల పెంట ప్రాంతాల్లోని అడవుల్లో మంటలు అంటుకున్నాయి. దాదాపు 50 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధమై ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు అటవీ సిబ్బంది చర్యలు చేపట్టింది. మంటలు విస్తరించకుండా అటవీశాకాధికారులు ఫైర్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. పచ్చికొమ్మలు, బ్లోయర్లు, ఇతర అధునాతన యంత్రాలతో సిబ్బంది మంటల్ని నియంత్రిస్తున్నారు.
మానవతప్పిదమే అయుంటుంది...
మానవతప్పిదాల కారణంగానే అడువుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతం సుమారు రెండున్నర లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంటుంది. ఇందులో లక్షా 75వేల హెక్టార్లు పులుల అభయారణ్యం. చెట్లరాపిడి వల్ల నిప్పు పుట్టేంత పెద్దవృక్షాలు నల్లమల అడవుల్లో లేవని అధికారులంటున్నారు. ఎవరైనా నిప్పు రవ్వల్ని వదిలితేనే... గడ్డి అంటుకుని, వేగంగా ఇతర ప్రాంతాలకు మంటలు విస్తరిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లమలలో జరిగే అగ్ని ప్రమాదాల వలన అరుదైన వృక్ష జాతి అంతా నాశనం అయిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటవీశాఖాధికారులు. దీంతో పాటూ అక్కడ నివసించే జంతుజాలం మనుగడ కూడా కష్టమవుతుందని అంటున్నారు. మరోవైపు కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్ల పెంట ప్రాంతాల్లోని గిరిజనుల తండాలను ఖాళీ చేయిస్తున్నారు. మంటలవల్ల వారికి ఏం ప్రమాదం జరగకుండా చూసుకుంటున్నారు.