Fight Over Mutton Curry At Wedding: పెళ్లి వేడుకల్లో మటన్ కోసం పరస్పరం ఘర్షణకు దిగిన 16మందిపై జగిత్యాల (Jagtial) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఆత్మకూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం..ఆత్మకూరుకు చెందిన యువతికి వేములవాడకు చెందిన అబ్బాయితో పెళ్లి ఫిక్సయ్యింది. వీరి పెళ్లి వధువు ఇంటి దగ్గర ఘనంగా జరిగింది. పెళ్లికి హాజరైన వధువరుల తరపు బంధువులు, మిత్రులందరికీ కుటుంబ సభ్యులు విందు భోజనం ఏర్పాటు చేశారు. మటన్ కూర, బగారా అన్నంతో పెళ్లికి వచ్చిన అతిథులకు వడ్డించారు. వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. కానీ మద్యం మత్తులో కొందరు గందరగోళం చేశారు. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది. పెళ్లింట రణరంగంగా మారింది.
ఇది కూడా చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకును చంపిన తల్లి
పీకల్లోతు మద్యం తాగి వచ్చిన వరుడి తరపు బంధువులు భోజనం చేసేందుకు సిద్ధం అయ్యారు. మటన్ అయిపోయిందని వధువు తరపున బంధువులు చెప్పారు. దీంతో మటన్ లేనిదే భోజనం చేయమని వరుడి వైపు బంధువులు గొడవ చేశారు. వంట పాత్రలను, టేబుళ్లను ఎత్తేసి వడ్డించే వారిపైకి దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకంది. వధువు బంధువులు ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివాహ విందు కాస్త గందరగోళంగా మారింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వధువరులను వేములవాడకు పంపించారు.
ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఘటనాస్థలానికి చేరుకున్న జగిత్యాల పోలీసులు 16మందిపై కేసు నమోదు చేశారు. అమ్మాయి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్బాయి బంధువులు ఏడుగురిపై, అమ్మాయి తరపు బంధువులు 9 మందిపై కేసుల నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో మటన్ కోసం తన్నులాట ప్రాణాలమీదకే వచ్చిందని పెళ్లికి వచ్చిన అతిథులు మండిపడుతున్నారు.