YCP : ఇటీవల ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో టీమిండియా(Team India) మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) హంగామా చేసిన సంగతి తెలిసిందే. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా బయటికి వచ్చేశారు. అనంతరం పవన్ కల్యాణ్‌కు మద్దతు చేయడంతో.. అంబటి జనసేనలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగినప్పటికీ అది జరగలేదు. ఇన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న అంబటి రాయుడు మళ్లీ వార్తల్లో నిలిచారు. ఆయన తాజాగా చేసిన ఓ ఆసక్తికమైన ట్వీటే ఇందుకు కారణం.
Also Read: నేటి నుంచే వైసీపీ ఎన్నికల శంఖారావం
సిద్ధం!!
అంబటి రాయుడు తన ఎక్స్(X) (ట్విట్టర్)లో 'సిద్ధం!!' అని ట్వీట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన ఇది పోస్ట్ చేశారు. దీంతో అంబటి రాయుడు తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారా అనే ప్రచారం మొదలైంది. మరో విషయం ఏంటంటే ఈరోజు నుంచి వైఎస్సార్‌సీపీ 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్ర ప్రారంభించనుంది. ఇలాంటి సమయంలో అంబటి రాయుడు చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. మరి ఆయన వైసీపీలో చేరుతారా లేదా అంటే దానిపై ఇంకా క్లారిటీ లేదు.
గతంలో చేసిన ట్వీట్ వైరల్
ఇదిలాఉండగా.. గతంలో వైసీపీకి రాజీనామ చేసిన రాయుడు ఆ తర్వాత జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కలిశారు. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని.. వైఎస్సార్‌సీపీతో కలిసి ముందుకెళ్తే తాను అనుకున్న లక్ష్యాలు సాధించలేనని అర్థమైనట్లు ట్వీట్ చేశారు. తన ఆలోచనలు.. వైఎస్సార్‌సీపీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల్లో ఫలనా స్థానం నుంచి పోటీ చేయాలని అనుకోలేదని పేర్కొన్నారు. అప్పట్లో ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆ తర్వాత రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా సిద్ధం అని ట్వీట్ చేయడంతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇక మే 13న ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న పార్లమెంటు స్థానాలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Also Read : పవన్ నిర్ణయమే ఫైనల్.. గీత దాటితే వేటే: నాగబాబు వార్నింగ్