బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ (Eatala Rajendar) మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రవర్తన తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు తానే చాలా గొప్ప వ్యక్తిగా ఊహించుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. మంగళవారం మీట్ ది ప్రెస్ లో భాగంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఈటల.. నిజాలెప్పుడూ కేసీఆర్ కు మింగుడు పడవని అన్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు కూడా ఆయనెప్పుడూ ఆసక్తి చూపించరంటూ ముఖ్యమంత్రి తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు. 'కాళ్ల కింద భూమి కదులుతున్న విషయాన్ని కేసీఆర్ గ్రహించటం లేదు. వాస్తవాలు చెబితే కేసీఆర్ దబాయింపుతో వ్యవహరిస్తారు. నీళ్లు, నియామకాల విషయంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు' అంటూ దుయ్యబట్టారు.
ఈ వార్త కూడా చదవండి: TS BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో లీక్.. సంచలన విషయాలివే!
అలాగే అభివృద్ధి పేరిట హైదరాబాద్ చుట్టుపక్కల 5,800 ఎకరాల భూమిని అతి చౌక ధరలకు కేసీఆర్ కుటుంబం తీసుకుందన్నారు. ఒక్క గజ్వేల్ లోనే 30వేల మంది కేసీఆర్ బాధితులున్నారని తెలిపిన ఈటల.. ముఖ్యమంత్రి అడుగులకు మడుగులు ఒత్తే వారికే బీసీ బంధు ఇప్పిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ క్రమంలోనే బీఆర్ ఎస్, బీజేపీ ఒకటేననే ఆంశంపై కూడా స్పందించిన ఈటల..
'బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే నేను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తాను? బీజేపీ, బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ కలసి పోటీ చేయలేదు. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారు. మా మధ్య ఏ ఒప్పందం లేదు. ఇవన్నీ ఆధారంలేని పుకార్లే' అని కొట్టిపారేశాడు. చివరగా బీఆర్ఎస్ ను నిలువరించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్న ఆయన.. హంగ్ వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, గతంలో కలసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.