తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న వేళ.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(EVM)ను బుధవారంలోగా కేటాయించాలని అధికారులకు ఆదేశించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటివరకు బ్యాలెట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్‌ల పంపిణీ ప్రక్రియను 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టామని పేర్కొంది. మరో 41నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల మరిన్ని బ్యాలెట్ యూనిట్లు పంపిస్తామని చెప్పింది. మరోవైపు సీ-విజిల్, ఇతర మార్గాల ద్వారా ఎన్నికల సంఘానికి ఇప్పటివరకు 27,330 ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే అధికారులు దాదాపు అన్నింటినీ పరిశీలించారు. అలాగే ఇప్పటివరకు నగదు, బంగారం, మద్యం, ఉచితాలతో పాటు తదితర వాటిని కలిపితే మొత్తం రూ.603 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Also read: చనిపోయిన కొడుకు ఆస్తిలో తల్లికి వాటా ఉంటుందా?: హైకోర్టు సంచలన తీర్పు
అయితే ఇందులో 214 కోట్ల డబ్బులు, రూ.179 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ.96 కోట్ల విలువైన మద్యం.. అలాగే రూ.78 కోట్ల విలువ చేసే ఉచితాలు కూడా ఉన్నాయి. మరోవైపు భద్రత అవసరాలు ఉన్నవారు తప్ప కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ వెహికిల్స్ వినియోగించకూడని ఎన్నికల సంఘం తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అధికారులు కూడా ప్రభుత్వ వాహనాలు వినియోగించకూడదని సూచించింది. మరోవైపు ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోను ప్రకటించగా.. తాజాగా బీజేపీ కూడా తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also read: ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య.. ఆయన్ని వేధించింది వారేనా.. ?