Eenadu Founder Ramoji Rao: మార్గదర్శి, ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడిగా మాత్రమే కాకుండా..తెలుగు మీడియా గమానాన్ని సమూలంగా మార్చేసిన దార్శనికుడిగా రామోజీరావుకు పేరుంది. రైతు బిడ్డగా పుట్టిన ఆయన తనకంటూ ఒక సామ్రాజ్యాన్నే స్థాపించుకున్నారు. తెలుగు మీడియాలో కొత్త చరిత్రను లిఖించారు. ప్రియా పచ్చళ్ళ నుంచీ ఇప్పటి ఈటీవీ భారత్ వరకు ప్రతీదీ చాలా స్పెషల్.
రామోజీరావు మొదలుపెట్టిన ప్రతీ ప్రాజెక్టు గొప్ప సక్సెస్‌ను అందుకుంది. మొదట నుంచీ తన స్వయంకృషితో ఆయన ఎదిగారు. 1974లో ఏర్పాటు చేసిన ఈనాడు దినపత్రిక ఓ పెద్ద సంచలనం. అప్పటి వరకు వచ్చిన పేపర్లు ఒక ఎత్తు అయితే ఈనాడు ఒక్కటీ ఒక ఎత్తు. ఆ తరువాత కూడా అది చాలా పేపర్లకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రజల మనసులను గెలుచుకుంది ఈనాడు. అది ఒక్కటే కాదు సితార, ఈటీవీ, మార్గదర్శి, అన్నదాత, చతుర, విపుల, రామోజీ ఫిల్మ్ సిటీ, ఈటీవీ భారత్ అన్నింటిలోనూ విజయమే. తరువాత మార్గదర్శి గ్రూప్ వలన అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ రామోజీరావు గొప్పతనాన్ని మాత్రం ఎవరూ తుడిచేయలేకపోయారు. ఎవరు ఎంత ప్రయత్నించినా..రామోజీరావు ప్రగతిని అడ్డుకోలేకపోయారు. అందుకే ఆయనను మీడియా మొఘల్ గా గుర్తింపు పొందారు.
ఈనాడు వార్తాపత్రికతో రామోజీరావు గొప్ప విప్లవాన్నే తీసుకొచ్చారు. అప్పటివరకు సంప్రదాయబద్ధంగా రాస్తున్న దినపత్రికల పోకడను ఒక్కసారిగా రూపురేఖలు మార్చేసారు. అందుకే ఈనాడు పెద్ద సంచలనం. జర్నలిజంలో కొత్త పోకడలకు కూడా ఈనాడు శ్రీకారం చుట్టింది. అప్పటిదాకా ఉన్న పద్ధతులను వెనక్కు నెట్టేసి కొత్త పద్ధతులను తీసుకువచ్చారు రామోజీరావు. పత్రిక యజమానే సంపాదికుడిగా ఉండడం కూడా ఒకటి ఇందులో. అందుకే ఈనాడు అంటే రామోజీరావుకు పర్యాయపదంగా మారింది. పత్రిక మొదలుపెట్టిన దగ్గర నుంచీ ఆయన ఎడిటర్‌గా వ్యవహరించారు. ఇది మొన్నమొన్నటి వరకు కూడా సాగింది. ఈ మధ్య కాలంలోనే ఆయన సంపాదకత్వం నుంచి తప్పుకున్నారు. మొత్తం 46 ఏళ్ళ సుదీర్ఘమైన సంపాదకత్వం చేశారు రామోజీరావు. ఆ తరువాత ఆయన ఫౌండర్‌గా కొనసాగారు.
రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చారు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు.ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు.