ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. మాంసాహారాన్ని కొనేందుకు మక్కువ చూపుతుంటారు. ఎక్కువగా చికెన్, మటన్ తింటుంటారు. కానీ రెడ్ మీట్ కంటే సీఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు సీ ఫుడ్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది చేపలే. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా చెరువుల్లో చేపలను తింటూ ఉంటాం. కొందరు సముద్రపు చేపలను అప్పటికప్పుడు పట్టుకొచ్చి కూర వండుకుని తింటుంటారు. చెరువుల్లో ఉండే చేపల కంటే సముద్రపు చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వైద్యులు అంటున్నారు. సాధారణంగా చేపలను వారానికి మూడుసార్లు తింటే చాలా లాభాలున్నాయని చెబుతున్నారు.
సమస్య నుంచి కోలుకోవచ్చని ఓ పరిశోధనలో వెల్లడి
మనకు వయసు పెరిగే కొద్దీ మతిమరుపు రావడం అనేది సహజం. కొందరికి ఈ సమస్య తీవ్రంగా మారి అల్జీమర్స్‌కు కూడా దారితీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను భోజనంలో భాగం చేసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి కోలుకోవచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. చేపలను నిత్యం తింటే మెదడు బాగా పనిచేస్తుంది. అలాగే మన జ్ఞాపకశక్తి కూడా మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చేపలను ఎక్కువగా తింటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను చాలా వరకు తగ్గిస్తాయి.
గొంతు క్యాన్సర్లను సమర్ధవంతంగా అడ్డుకుంటుంది
రక్తనాళాల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా ఇవి రక్షిస్తాయి. చేపలను ఎక్కువగా తినడం వల్ల వీటిలో ఉండే డొపమైన్, సెరోటోనిన్ హార్మోన్లు మనలో డిప్రెషన్ తగ్గిస్తాయి. అలాగే ఒత్తిడి, మానసిక ఆందోళనలు కూడా తక్కువ అవుతాయి. సీ ఫుడ్‌లో ఉండే 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తక్కువ చేస్తాయి. పెద్దపేగు, నోటి, గొంతు క్యాన్సర్లను సమర్ధవంతంగా అడ్డుకుని ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. మహిళల్లో రుతుక్రమం బాగా ఉండాలంటే చేపలను తరచూ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా మధుమేహం, బీపీ, మెదడుకు సంబంధించిన సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. చేపల్లో చలికి తట్టుకునేలా చేసే నూనెలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో చలి వల్ల వచ్చే నొప్పుల నుంచి మనల్ని ఇవి కాపాడుతాయి. శరీరంలోని ప్రతి కణానికి సరిపడా ప్రోటీన్‌ని చేపలు అందిస్తాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కడుపులో మంట, వేడి కూడా తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: గేదె పాలు, ఆవు పాలలో ఏది బెటరంటే…!!