Droupadi Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) పోచంపల్లి అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. శీతాకాల విడిది కోసం ఆమె హైదరాబాద్(Hyderabad) కు వచ్చిన ఆమె తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై అలరించిన ద్రౌపది.. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు.
ఈ మేరకు పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోచంపల్లి టై అండ్ డై, ఇక్కత్ చీరల తయారీ, చేనేత మగ్గాలు, ఫొటో ఎగ్జిబిషన్‌తోపాటు చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే థీమ్ పెవిలియన్ పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. పోచంపల్లి చేనేత కళాకారులతో మాట్లాడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పోచంపల్లి వస్త్రాలకు మంచి గుర్తింపు ఉందని, చేనేత కార్మికులను చూసిన తర్వాత తనకు చెప్పలేని ఆనందం కలిగిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
‘చేనేత కళ విభిన్నమైంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయం. చేనేత కళను భావితరాలకు అందించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. పోచంపల్లి చేనేత కార్మికులు ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుంటా. పోచంపల్లి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను' అని రాష్ట్రపతి హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి : Rahul Gandhi : అప్పుడెక్కడికి వెళ్లారు మీరంతా.. మీడియాకు రాహుల్ కౌంటర్..
ఇదిలావుంటే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో చిన్న ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్నపుడు పోలీసులు గాలికి ఎగిరిపడ్డారు. దీంతో ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీకి చెయ్యి విరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.