Dark Humor : యూట్యూబ్‌లో డాంక్ రోత.. తల్లి కొడుకులు, తండ్రికూతుళ్లపై సెక్సిస్ట్‌ జోక్స్‌!

డాంక్.. ఈ పదం సోషల్ మీడియా యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. తల్లి కొడుకులు, తండ్రికూతుళ్లకు శారీరక సంబంధం అంటగడుతూ జోక్స్‌ వెయ్యడాన్ని డార్క్‌ హూమర్‌ అంటారు. డాంక్ పేరిట యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లు తమ రోతకు పెట్టుకున్న పేరు 'కామెడీ'.

Dark Humor : యూట్యూబ్‌లో డాంక్ రోత.. తల్లి కొడుకులు, తండ్రికూతుళ్లపై సెక్సిస్ట్‌ జోక్స్‌!
New Update

Praneeth Hanumanthu : డాంక్‌..! (Donk) ఈ పదం అర్థమేంటో తెలుసా? తల్లి కొడుకుల రిలేషన్‌పై సెక్సిస్ట్‌ జోక్స్‌ వెయ్యడం.. తండ్రికూతుళ్లకు శారీరక సంబంధం అంటగడుతూ జోక్స్‌ వెయ్యడం..! దీన్నే కొందరు డార్క్‌ హూమర్‌ (Dark Humor) అని పిలుస్తుంటారు. అయితే సోషల్‌మీడియా, యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లకు (YouTube Content Creators) మాత్రం ఇది డాంక్‌. ఇలా చేయడం ఏ మాత్రం తప్పు కాదని బయట చెప్పుకుంటారు. నవ్విస్తున్నామనే ముసుగులో మానవ విలువలకు పాతరేస్తారు. వావివరసలు మార్చిపోయి అడ్డమైన కామెంట్స్‌ చేస్తుంటారు. యూట్యూబ్‌ కంటెంట్ క్రియెటర్‌ ప్రణీత్‌ హనుమంతు కూడా అలాంటివాడే. ఫణిమంతుగా యూట్యూబ్‌ సర్కిల్స్‌లో పాపులర్‌ అయిన ప్రణీత్‌ హనుమంతు చేసిన ఓ రోత కంటెంట్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

తండ్రీకూతుళ్లకు శారీరక సంబంధం అంటగడుతూ..
సోషల్‌మీడియాలో కొన్ని రోజులగా ఫణిమంతు, అతని ఫ్రెండ్స్‌కు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది. తండ్రీకూతుర్ల రిలేషన్‌కు శారీరక సంబంధం అంటగడుతూ డార్క్‌ హ్యూమర్‌ చేసింది ఫణిమంతు టీమ్. ఆ వీడియోలో ఒక అతను సెక్సిస్ట్‌ కామెంట్‌ చేయగా.. దానికి మిగిలినవారంతా పగలబడి నవ్వారు. అసలు అది జోక్‌ అని ఎలా అనిపించిందో తెలియదు కానీ అంతా ఎగబడిఎగబడి నవ్వారు. ఆ వీడియోలో ఒక అతను అయితే నవ్వు రాకున్నా నవ్వుతూనే ఉన్నాడు. అలా గట్టిగా నవ్వితేనే రీచ్‌ వస్తుంది కాబోలు. అయితే ఆ మొత్తం వీడియోలో అసభ్యకరంగా ఉన్న ఓ పార్ట్‌ను కట్‌ చేసి కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత..
ఫణిమంతు టీమ్‌ కామెంట్స్‌పై సోషల్‌మీడియా (Social Media) యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చాలామంది నెటిజన్లు ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులకు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు పెట్టారు. ఇక టాలీవుడ్‌ నటుడు సాయ్‌ ధరమ్‌ తేజ్‌ కూడా ఇదే విషయంపై ఘాటుగా రియాక్ట్ ఇచ్చాడు. చిన్నారులపై చేసే ఇలాంటి కామెంట్స్‌పై నిప్పులు చెరిగిన సాయ్‌ ధరమ్‌ తేజ్‌ సంబంధిత ట్వీట్లను రెండు రాష్ట్రాల సీఎంలకు ట్యాగ్‌ చేశాడు. దీంతో తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు పోలీసులూ రెస్పాండ్‌ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై FIR నమోదైనట్టుగా ట్వీట్ చేశారు. అడ్డమైన కామెంట్స్‌ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కామెడీ కంటే సెక్సిస్ట్‌ కంటెంటే ఎక్కువ..
అటు ఈ విషయంపై ప్రణీత్‌ హనుమంతు (Praneeth Hanumanthu) రియాక్ట్ అయ్యాడు. తాను చేసింది తప్పేనని అంగీకరించాడు. మరోవైపు సోషల్‌మీడియా యూజర్లు హనుమంతుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుకు ఇలా చేయడం కొత్తేమీ కాదని పాత వీడియోలను సాక్ష్యంగా చూపిస్తున్నారు. అసలు హనుమంతు చేసేదాంట్లో కామెడీ కంటే క్రింజ్‌ కంటెంట్‌, సెక్సిస్ట్‌ కంటెంటే ఎక్కువగా ఉంటుందని అతని ఛానెల్‌ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్‌ స్కూల్‌ పిల్లలు, టీనేజర్లపై చెడు ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు. ఇక ఫణిమంతు తండ్రి ఓ సీనియర్‌ IAS అధికారి. ఇటు హనుమంతు ఇటివలీ సుధీర్‌ హీరోగా రిలీజైన 'హోరం హర' సినిమాలో ఓ చిన్నపాత్రలో నటించాడు.

అటు ఫణిహంతు ఒక్కడే కాదు.. ఈ తరహా వీడియోలు చేస్తూ మేమే పెద్ద డాంక్‌ అన్నట్టు రోత క్రియేట్ చేసేవారి సంఖ్య యూట్యూబ్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో ఎక్కువ. కరోనా సమయంలో ఇలాంటి కంటెంట్లు ఎక్కువగా క్రియేట్ చేసి డబ్బులు సంపాదించారు ఈ డాంక్‌గాళ్లు. వ్యూస్‌ కోసం, రీచ్‌ కోసం వీళ్లు ఎంతగా దిగజారుతారో చెప్పేందుకు ఓ లెక్కంటూ లేదు.

సినీ నటులపై ఘోరమైన ట్రోలింగ్‌ చేయడం, జోకుల ముసుగులో బాడీ షేమింగ్‌ చెయ్యడం, సెక్సిస్ట్‌ కామెంట్స్‌ చేయడం, మానవ బంధాలతో సంబంధం లేకుండా శారీరక సంబంధాలు అంటగట్టడం వీళ్లంతే చేసే నిత్యఘోరం. అటు ఫేస్‌బుక్‌లోనూ డాంక్‌ మీమ్స్‌ క్రియేట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందే వారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రోతకు వీళ్లు పెట్టుకున్న పేరు 'కామెడీ'..!

Also Read : వినుకొండలో హైటెన్షన్‌.. రషీద్ ఇంటికి చేరుకున్న జగన్



#youtube #praneeth-hanumanthu #dark-humor #donk
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe