Trigger Finger Disease: చేతి వేళ్లను ఒకే స్థితిలో ఉంచితే ట్రిగ్గర్ ఫింగర్ అనే వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడటం లేదా కంప్యూటర్‌లో టైప్ చేయడం వల్ల వేళ్లు బిగుసుకుపోయి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి బారిన పడితే చేతులు బాగా నొప్పిగా ఉంటాయి. అసలు ట్రిగ్గర్ ఫింగర్ అంటే ఏంటి?.. దాని కారణాలు, చికిత్సా విధానాలు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఫోన్, కంప్యూటర్, టాబ్లెట్ వంటి గాడ్జెట్లు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. రోజంతా మన వేళ్లు ఫోన్ స్క్రీన్ లేదా కీబోర్డ్‌పై డ్యాన్స్ చేస్తూనే ఉంటాయి, దీని వల్ల వేళ్లు ఎక్కువసేపు ఒకేలా వంగి ఉంటాయి. ఈ కారణంగా వేళ్లలో సమస్య తలెత్తుతుంది. దీనిని ట్రిగ్గర్ ఫింగర్ అంటారు. ఈ వ్యాధి కారణంగా వేళ్లను వంచడంలో మరియు నిటారుగా ఉంచడంలో ఇబ్బంది తలెత్తుతుంది.
ట్రిగ్గర్ ఫింగర్ అంటే ఏమిటి?
- ట్రిగ్గర్ ఫింగర్ అనేది వేళ్లు బెంట్ పొజిషన్‌లో చిక్కుకునే రుగ్మత. ఒకే భంగిమలో వేళ్లను ఉంచడం వల్ల ఇది వస్తుంది. ఈ వ్యాధి వస్తే వేళ్లను స్ట్రెయిట్ చేస్తున్నప్పుడు క్లిక్ మనే సౌండ్ వినిపిస్తుంటుంది. అలాగే వేళ్లు యొక్క స్నాయువులు కూడా ఉబ్బుతాయి. దీంతో వేళ్లను నిటారుగా ఉంచాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా కనిపిస్తుంది.
ట్రిగ్గర్ ఫింగర్ కావడానికి కారణాలు
- వేలిని నిరంతరం ఒకే స్థితిలో ఉంచడం వల్ల ఈ సమస్య వస్తుంది. కొన్నిసార్లు వేళ్ల స్నాయువులో ఒక ముద్దలాంటి పదార్థం కూడా ఏర్పడుతుంది. దీంతో వేళ్లు నిటారుగా పెట్టడం, మరియు కదిలించడం కష్టంగా మారుతుంది. చాలా వరకు ఈ సమస్య ఉంగరపు వేలు, బొటనవేలులో కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో మిగతా వేళ్లలో కూడా కనిపిస్తుంది.
ట్రిగ్గర్ ఫింగర్ లక్షణాలు
- వేలిని వంచినా లేదా నిటారుగా ఉంచేటప్పుడు పగుళ్లు వచ్చే శబ్ధం రావడం, వేలి దగ్గర గడ్డలు లేదా వాపు రావడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది. ట్రిగ్గర్ ఫింగర్ కారణాలు తోటపని లేదా ఎక్కువ గంటలు కంప్యూటర్‌లో పని చేయడం, పియానో వంటి సంగీత వాయిద్యాన్ని వాయించడం.
ట్రిగ్గర్ ఫింగర్ చికిత్స
- ఈ సమస్య దానంతటే తగ్గిపోదు. వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. స్ట్రెచింగ్ వ్యాయామం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. పని చేసేటప్పుడు మీ వేళ్లను ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉంచవద్దని, మధ్య మధ్యలో సాగదీస్తూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా వస్తువును పట్టుకునేప్పుడు గట్టిగా పట్టుకోకుండా మృదువుగా హ్యాండిల్ చేయాలని చెబుతున్నారు. దీంతో వేళ్లపై ఒత్తిడి తగ్గుతుందని, వాపు కూడా తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: రెడ్‌వైన్ వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయా?.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.