Walking Benefits : నడక (Walking) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సులభమైన వ్యాయామం (Exercise). ప్రతిరోజు మనం వేసే అడుగు మన ఆయుష్షును పెంచుతుందని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే తాజా అధ్యయనంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆరోగ్యకర జీవనానికి రోజుకు 10వేల అడుగులు వేయాల్సిందేనని అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ, పోలండ్‌లోని లాడ్జ్ మెడికల్ యూనివర్సిటీ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది.
రోజుకు 10వేల అడుగులు..
1964 టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) కు ముందు జపాన్‌కు చెందిన ‘యమసా’ గడియారాల ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆ సమయంలో యమసా కంపెనీ కొత్తగా ఓ ‘పెడోమీటర్’ను ఆవిష్కరించింది. అది మెటల్ బాల్‌తో ఉండే ఒక కౌంటింగ్ మిషన్. దాన్ని నడుముకు ధరిస్తే మనం రోజుకు ఎన్ని అడుగులు వేశామో లెక్కిస్తుంది. ఒలింపిక్స్ సమయంలో దానికి విశేష ఆదరణ దక్కడమే కాకుండా.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ‘రోజుకు 10వేల అడుగులు' అనే మాట వ్యాప్తి చెందింది. ఆ తర్వాత ఈ సలహాపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఇందుకోసం దాదాపు 2.26లక్షల మందితో 17 వేర్వేరు పరిశోధనలు జరిపింది. రోజుకు ఎంతసేపు నడవాలనే ప్రశ్నకు పరిశోధకులు రకరకాల ప్రత్యామ్నాయాలు సూచించారు. రోజుకు దాదాపు 4వేల అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇది అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అధికబరువు/ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. 2337 అడుగులతో గుండె సంబంధిత (కార్డియోవాస్కులర్) జబ్బులతో మరణించే అవకాశాలు తగ్గుతాయని తెలిపారు.
గుండెజబ్బులు 15 శాతం తగ్గిపోతాయి..
అలాగే రోజుకు వెయ్యి అడుగులు వేస్తే గుండెజబ్బుల మరణాలు 15 శాతం తగ్గిపోతాయి. 500 అడుగులు పెంచితే 7 శాతం తగ్గుతాయి. 60 ఏళ్లు పైబడినవారు రోజుకు ఆరు వేల అడుగుల నుంచి 10 వేల అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పు 42 శాతం తగ్గుతుందని ఈ పరిశోధకులు సూచించారు. రోజు 8వేల నుంచి 10వేల అడుగులు నడవడం అనేది ఉత్తమం. ఒక్క రోజులోనే 10వేల అడుగులను చేరుకోలేకపోవచ్చు. వేగంగా నడవాలన్న ప్రయత్నంలో కొన్ని సార్లు గుండె మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి 2,500 నుంచి 3000లతో మొదలుపెట్టి నెమ్మదిగా ప్రతి 15రోజులకి ఐదు వందల చొప్పున పెంచుకుంటూ వెళ్లినా మేలంటున్నారు.
Also Read : హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్.. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక సారథి!