రోజూ మెట్లు ఎక్కి దిగితే ఏమవుతుందో తెలుసా..?

హెల్తీ ఫుడ్ తినడంతో పాటు రెగ్యులర్‌గా శారీరక శ్రమ చేస్తే శరీరంలో అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా మనిషి జీవితకాలం పెరుగుతుంది. రోజూ మెట్లు ఎక్కి దిగినా మనిషి జీవితకాలం పెరుగుతుందని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

New Update
రోజూ మెట్లు ఎక్కి దిగితే ఏమవుతుందో తెలుసా..?

ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలంటే శరీరంలోని కీలక అవయవాలు గుండె, కిడ్నీలు, కాలేయం వంటివి సక్రమంగా పనిచేయాలి. హెల్తీ ఫుడ్ తినడంతో పాటు రెగ్యులర్‌గా శారీరక శ్రమ చేస్తే శరీరంలో అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా మనిషి జీవితకాలం పెరుగుతుంది. రోజూ మెట్లు ఎక్కి దిగినా మనిషి జీవితకాలం పెరుగుతుందని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

* ఆకస్మిక మరణం ముప్పు ఉండదు

రెగ్యులర్‌గా మెట్లు ఎక్కడం వల్ల శరీరంలోని కండరాలు సంకోచం, వ్యాకోచం చెంది రిలాక్స్ అవుతాయి. ఇది అకాల మరణ ముప్పును తగ్గిస్తుందని అధ్యయనం పేర్కొంది. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల సాధారణ జీవితకాలం కంటే అదనంగా 14 సంవత్సరాలు జీవించవచ్చని అధ్యయనంలో తేలింది.

* జీవితకాలం అదనంగా 14 ఏళ్లు పెరుగుదల

రెగ్యులర్ వర్కవుట్స్ చేసేవారు లేదా క్రమం తప్పకుండా మెట్లు ఎక్కే వ్యక్తులు ఎంత ఎక్కువ కాలం జీవిస్తారో తెలుసుకోవడానికి పరిశోధకులు దాదాపు 5 లక్షల మంది వ్యక్తుల హెల్త్ డేటాను అధ్యయనం చేశారు. డైలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం.. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కే వ్యక్తుల్లో హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణించే రిస్క్ 39 శాతం తక్కువగా ఉంటుంది.

ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వ్యక్తి జీవితకాలం అదనంగా 14 సంవత్సరాలు పెరగడానికి ఇదే కారణమని నిపుణులు గుర్తించారు. ప్రతిరోజూ మెట్లు ఎక్కడం వల్ల మనిషికి ప్రాణాంతకం కలిగించే అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని సైతం తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది.

* అనారోగ్యాలకు మూలం శ్రమ లేకపోవడం

ప్రస్తుత ఆధునిక యుగంలో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఫలితంగా శారీరక శ్రమ తగ్గింది. ఒకప్పుడు రోజులో కనీసం మూడు నాలుగు సార్లు మెట్లు ఎక్కే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎక్కడచూసినా ఎలివేటర్లు, ఎస్కలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా మెట్లను ఎవరూ ఉపయోగించుకోవడం లేదు. ఉద్యోగాల్లో ఎక్కువగా డెస్క్ జాబ్స్ ఉంటున్నాయి. వీటన్నింటి కారణంగా శరీరక శ్రమ బాగా తగ్గిపోతుంది. ఇది చివరికి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది.

* ఆరోగ్యం కోసం మెట్ల వినియోగం పెరగాలి

ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సోఫీ పాడాక్ మాట్లాడుతూ… ‘‘ఎస్కలేటర్ అందుబాటులో ఉన్నప్పటికీ మెట్లను వినియోగించుకోవాలి. మెట్లు ఎక్కడం వల్ల మనిషి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎవరైనా చాలా ఎత్తైన అంతస్తుకు వెళ్లాల్సి వస్తే శరీరం ఫిట్‌గా ఉండేందుకు కనీసం నాలుగైదు అంతస్తులు ఎక్కాలి.’’ అని ప్రొఫెసర్ సోఫీ సూచించింది.మెట్లు ఎక్కడం అనేది వివిధ వ్యాయామాల కంటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనంలో తేలింది. బరువు తగ్గాలనుకునేవారు శరీరంలో కేలరీలను కరిగించుకోవడానికి మెట్లు ఎక్కితే సరిపోతుంది. జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాల కంటే మెట్లు ఎక్కడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మెదడు, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది. మెట్లు ఎక్కడం వల్ల శరీరం ఫిట్‌గా మారుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది.

Advertisment
తాజా కథనాలు