అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్య ఆలయానికి సంబంధించిన వివరాలపై భక్తుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన పలు వివరాలు తెలుసుకునేందుకు నెట్టింట్లో శోధిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని కీలక సంఖ్యలు, గణాంకాలు తెలుసుకుందాం.
భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సరయు నది ఒడ్డున అయోధ్య ఉంది. గతంలో బాబ్రీమసీదు ఉన్న ప్రదేశంలో 2.77 ఎకరాల విస్తీర్ణంలో రామమందిరాన్ని నిర్మిస్తున్నారు.
ఆలయ ప్రధాన శిఖరం (గోపురం) 161 అడుగుల ఎత్తుంటుంది. ఇది భారతదేశంలోని ఎత్తైన దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందనుంది. ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉంటుంది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు కాగా మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో 160, తొలి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి.
ఆలయ నిర్మాణం, పరిసర ప్రాంతాల అభివృద్ధితో సహా మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ.1,100 కోట్లు. రామమందిర నిర్మాణం 2020 ఆగస్టులో ప్రారంభమైంది. 2024లో పూర్తవుతుంది. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ ఆలయం ఆధునిక సాంకేతికతతో పాటు సాంప్రదాయ భారతీయ వాస్తు శిల్పాన్ని మిళితం చేసే ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
ఆలయంలో రాముడి జీవితాన్ని వివరించే పురాతన భారతీయ ఇతీహాసం రామయణ దృశ్యాలను వర్ణించే శిల్పాలను ఏర్పాటు చేస్తున్నారు. రాజస్థాన్ నుండి సేకరించిన పింక్ ఇసుకరాయిని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది 10 మిలియన్ల మంది భక్తులు అలయాన్ని దర్శించుకుంటారని అంచనా.
కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్య రామాలయంలో ప్రతిష్టించనున్నారు. కృష్ణ శిలలతో చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట కోసం ఎంపిక చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం సోమవారం ధృవీకరించింది.
అంతకుముందు రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం అరుణ్ యోగి రాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేస్తామని కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప చెప్పారు. తాజాగా టెంపుల్ ట్రస్ట్ ఇదే విషయాన్ని దృవీకరించింది.