DK Aruna: ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మాదే: డీకే అరుణ

New Update
DK Aruna: ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మాదే: డీకే అరుణ

బీజేపీ ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధమవుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. గత 9 ఏళ్లుగా రాష్ట్రాన్ని కేసీఆర్‌ పట్టిపీడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దొరను ప్రజలు తమిరి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడి, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశామని, అలాంటి వాతావరణంలో భాగమే ఇవాళ్టి దిశ కార్యక్రమం అన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు వారం రోజుల పాటు తెలంగాణలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న బీజేపీ నేతలు.. ప్రజల ఆకాంక్షల మీద రిపొర్ట్‌ తయారు చేస్తారని డీకే అరుణ తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్‌పై జాతీయ బీజేపీ ఉపాధ్యక్షురాలు మండిపడ్డారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకు వస్తాయన్నారు. కేసీఆర్‌ భూములను అమ్మి ప్రభుత్వ సొమ్ముతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీనే విజయం సాధిస్తుందని డీకే అరుణ జోస్యం చెప్పారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్న ఆమె.. ఆ రాష్ట్రాల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌ అనేది దొంగల పార్టీ అని డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజల్ని దోచుకుంటున్నారని, వారు గజదొంగల కంటే ఎక్కువగా మారారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అధికారం కోసం గడ్డి తినేందుకు కూడా వెనుకాడరని డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన కేసీఆర్‌.. ప్రస్తుతం మతం పేరుతో గెలవాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రాన్నితాను అభివృద్ధి చేశాననే నమ్మకం కేసీఆర్‌కు ఉంటే పోలీసులు లేకుండా ప్రజల్లోకి రావాలని డీకే అరుణ సవాల్‌ చేశారు.

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడా బాంబు దాడులు, మత కలహాలు జరుగలేదని డీకే అరణ తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మతం పేరుతో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తూ దేశంలో హింస సృష్టిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు