పల్లె పల్లెకూ బీజేపీ కార్యక్రమం చెపట్టబోతున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు దిలీపా చారి అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల మధ్యకు వెళ్లి అధికార పార్టీ నాయకుల అవినీతిపై వివరిస్తామన్నారు. మరోవైపు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్యే మితిమీరి మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే అహంకారపూరిత, దౌర్జన్యపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మర్రి జనార్దన్ రెడ్డి డబ్బు, అహకార మదంతో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.
మర్రి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్ప ప్రజలకు సేవ చేసి మెప్పించి ఓట్లు సంపాదించాలనే లక్ష్యంతో లేరన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్యే హింస సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. మర్రి జనార్దన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్న ఆయన.. అందుకే ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ప్రజా స్పందన కరువైందని డప్పు చాటింపు చేసి జన సమీకరణ చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగా అడ్డా కూలీలకు 800 రూపాయలు ఇచ్చి పాదయాత్రకు తీసుకెళ్తున్నారని, మహిళలకు 500 రూపాయలు ఇచ్చి తన యాత్రకు తీసుకెళ్తున్నట్లు వివరించారు.
ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు, కార్యకర్తలు స్వచ్చందంగా వస్తారన్న ఆయన.. ఎలాంటి అభివృద్ధి చేయని ఎమ్మెల్యేకు తోడుగా ఎవరు వస్తారని ప్రశ్నించారు. తన పాదయాత్రకు స్వచ్చందంగా వచ్చేవారు లేకపోవడంతోనే ఆయన డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నట్లు విమర్శించారు. ఎమ్మెల్యే అరాచకాలు ప్రజలకు అర్ధమైపోయిందని, రానున్న ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డికి ఓట్లు వేయరన్నారు. మరో మూడు నెలల్లో నాగర్ కర్నూల్‌లో బీజేపీ జెండా ఎగురడం ఖాయమని దిలీపాచారి స్పష్టం చేశారు.