దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం నెలకొంది. యమునా నదికి ప్రవాహం తగ్గడంతో నగర ప్రజలు నీరు లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ సర్కార్ గుర్తించింది. దీంతో జల మంత్రిత్వశాఖ కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నగరానికి వచ్చే ప్రధాన పైప్‌లైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ మంత్రి అతిశీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు.
Also Read: గంగానదిలో పడవ ప్రమాదం.. ఆరుగురు గల్లంతు!
యమునా నదికి ప్రవాహం తగ్గడంతో రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోందని తెలిపారు. దీనివల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టు విలువైందని.. దాని పంపిణీ వ్యవస్థను కాపాడుకోవాలని తెలిపారు. అలాగే ఢిల్లీకి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైపులైన్‌లో అనేక చోట్ల బోల్టులను తొలగించడంతో అక్కడ లీకేజీలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. దీనివెనుక ఏదో దురుద్దేశం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. నీటి పైపులను రక్షించేందుకు 15 రోజులపాటు గస్తీ నిర్వహించాలని లేఖలో పోలీస్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉండగా.. ఢిల్లీలో నీటి కొరతపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఢిల్లీ జల్ బోర్డను ధ్వంసం చేశారు. ఇది బీజేపీ నేతల పనేనని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నీటీ సంక్షోభం వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని అక్కడి స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.