Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో సారి షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు (Delhi Liquor Scam) సంబంధించి సీబీఐ తనను అరెస్ట్ చేయడం అక్రమమంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు (Delhi Court) కొట్టివేసింది. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను ఈడీ, సీబీఐ (CBI) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రెండు సంస్థల అరెస్టుల చట్టబద్ధతను కేజ్రీవాల్ సవాలు చేశారు. మధ్యంతర బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాజా నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం ఏమిటి?
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ 2021-22ని 17 నవంబర్ 2021న అమలు చేసింది. కొత్త విధానంలో ప్రభుత్వం మద్యం వ్యాపారానికి సంబంధించిన షాపులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కొత్త మద్యం పాలసీతో మాఫియా పాలన అంతం అవుతుందని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. అయితే.. ఆ పాలసీ తీవ్ర వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం జూలై 28, 2022న దానిని రద్దు చేసింది. 2022 జూలై 8న అప్పటి ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ నివేదిక ద్వారా మద్యం కుంభకోణానికి సంబంధించి వివరాలను బయటపెట్టాడు.
ఈ నివేదికలో మనీష్ సిసోడియాతో సహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు అగ్ర నేతలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నుంచి మొత్తం తొమ్మిది సమన్లు కేజ్రీవాల్ జారీ అయ్యాయి. అయితే వాటికి ఆయన రెస్పాండ్ కాకపోవడంతో ఈ ఏడాది మార్చి 21న ఆయనను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించింది. అనంతరం సీబీఐ సైతం ఆయనను అరెస్ట్ చేసింది.