land for job scam : బీహార్‌లో రాజకీయ గందరగోళం మధ్య ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌తో పాటు ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం (land for job scam) కేసులో నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది.వీరిని ఫిబ్రవరి 9న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈడీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఈ కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కత్యాల్‌కు కూడా కోర్టు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే ఉత్తర్వులను జారీ చేస్తూ, విచారణకు తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి 9, 2024న నిందితులను కోర్టులో హాజరుపరిచేందుకు కోర్టు నిర్ణయించింది.
మరోవైపు బీహార్ లో రాజకీయ గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జేడీయూ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ మళ్లీ బీజేపీతో జతకట్టేందుకు రెడీ అయ్యారు. ఆర్జేడీ సర్కార్ నుంచి తప్పుకుని సీఎం పదవికి రాజీనామా చేస్తారని సమాచారం. అలాగే ఆదివారం సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు ఎన్డీఏ కూటమితో కలిసి కొత్త సర్కార్ ను ఏర్పాటు చేస్తారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.