రోజురోజుకి సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. మన దేశంలో దళితులపై వివక్షలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట దళితులపై దాడులు చేసే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ దళిత యువకుడిపై దాడి చేసి అతనిపై మూత్రం పోయడం కలకలం రేపుతోంది. నవంబర్ 1న ఈ ఘటన జరగినప్పటికీ.. కొంతమంది స్థానిక నేతలు.. దళితులు, గిరిజనలుపై దాడులు పెరుగుతున్నాయని నిరసనలు చేయగా.. తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. కంచిచెర్ల గ్రామానికి చెందిన కండ్రు శ్యామ్ కుమార్ (21) ను బాధితునిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ' హరీష్ రెడ్డి, శ్యామ్ కుమార్‌లు ఓ కాలేజ్‌లో చదువుకునేటప్పుడు స్నేహితులు.
అయితే ఓ అమ్మాయి విషయంలో వాళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో హరీష్ రెడ్డి.. శ్యామ్ కుమార్‌పై పగ పెంచుకున్నాడు. ఇక నవంబర్ 1వ తేదీన శ్యామ్ కుమార్ తన ఇంట్లోనే ఉన్నాడు. హరీష్ రెడ్డి అతనికి ఫోన్ చేసి దగ్గర్లో ఉన్న శివసాయి క్షేత్రానికి రమ్మనాడు. శ్యామ్ కుమార్ అక్కడికి వెళ్లగానే.. హరీష్ రెడ్డి అతని ఐదుగురు స్నేహితులు కలిసి శ్యామ్‌ను కారులో తోసేసి.. గుంటూరు జిల్లాలోకి తీసుకెళ్లారు. కారులో వెళ్తుండగానే శ్యామ్‌పై వారు దాడికి దిగారు. దాదాపు 4 గంటలకు పైగా ఆ ఆరుగురు నిందితులు బాధితుడ్ని చిత్రహింసలు పెట్టారు. చివరికి శ్యామ్ అలసిపోయి దాహంగా ఉందని నీళ్లు కావాలని అడిగాడు. కానీ నిందితులు అతనిపై మూత్రం పోశారు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న డబ్బులు, బంగారు గొలుసును తీసుకున్నారు. చివరికి గుంటూరు జిల్లాలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో శ్యామ్‌ను వదిలేసి.. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
Also Read: అప్పుడేం చేశారు.. నారా లోకేష్ పై మంత్రి విడదల రజని సంచలన కామెంట్స్..
ఆ తర్వాత శ్యామ్ ఎలాగోలా ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు'. రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు నిందితులని అరెస్టు చేశారు. హరీష్ రెడ్డి (22), అనిల్ కుమార్ (22), శ్రీకాంత్ రెడ్డి (23), విష్ణువర్ధన్ రెడ్డి (23), నాగార్జున రెడ్డి (22), వెంకట లక్ష్మీ నారాయణ (24) లను నిందితులుగా గుర్తించారు. ఇందులో నలుగురు నిందితులు ప్రకాశం జిల్లాకు చెందిన వారు కాగా.. వెంకట లక్ష్మీ నారాయణ గుంటురు జిల్లాకు చెందినవాడిగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా ఏపీలో ఈ ఏడాది ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. జులైలో ఒంగోలులో ఓ దళిత వ్యక్తిపై మూత్రం పోసినందుకు తొమ్మిదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.