వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. వీకెండ్‌తో పాటూ సోమవారం బక్రీద్ కావడంతో ఆ రోజు కూడా ప్రభుత్వ భాలిడే వచ్చింది. దీంతో చాలామంది తిరుపతికి చేరుకున్నారు. వేలాదిగా వచ్చిన భక్తులతో తిరుమల అంతా నిండిపోయింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో సైతం భక్తులు కిక్కిరిసిపోయారు. మరోవైపు భక్తుల తాకిడి కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి.. సుమారు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్ వ్యాపించింది. పాపవినాశనం వెళ్లే దారిలో ఉన్న కళ్యాణ వేదిక వరకూ భక్తులు బారులు తీరారు.
వేలల్లో భక్తులు రావడంతో శ్రీనివాసుని దర్శనానికి చాలాసేపు సమయం పడుతోంది. దర్శనానికి 28 నుంచి 30 గంటల టైమ్ పడుతోంది. దీనికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలైన్లలోకి తాగునీరు, అన్నప్రసాద పంపిణీ చేస్తోంది. ఆదివారం, సోమవారం కూడా ఇదే రద్దీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు టీటీడీ అధికారులు. గురువారం నుంచి కూడా యాత్రికుల తాకిడి తగ్గలేదని టీటీడీ వర్గాలు తెలిపాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో సీనియర్ అధికారులు , విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షణలు చేస్తున్నారు.