లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి.. మూడోసారి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ పాలనలో ఆర్టికల్ 370ని రద్దు చేయడం, G-20 సమావేశం నిర్వహించడం, రామ్ మందిర్ నిర్మాణం, యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసేందుకు సిద్ధమవ్వడం లాంటి అంశాలన్నీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనవే. ఈ నేపథ్యంలో సీఎస్‌డీఎస్ - లోక్‌నీతి సంస్థ ఎన్నికలకు సంబంధించి మోదీ ప్రభుత్వ పాలనపై ఓ ప్రీ పోల్ సర్వేను నిర్వహించింది. భారత ఓటర్లు బీజేపీ ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారనే విషయాలను ఈ సర్వేలో వెల్లడించింది.
ఆర్టికల్ 370 గురించి ఏం చెప్పారంటే
ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. కేంద్ర ప్రభుత్వం 2019లో జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి అధికారం కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. లోక్‌నీతి జరిపిన సర్వేలో.. ఈ నిర్ణయానికి 34 శాతం మంది ఓటర్లు సానుకూలంగా స్పందించారు. మరో 16 శాతం ఓటర్లు ఈ నిర్ణయాన్ని సమర్థించినప్పటికీ.. ఈ పద్ధతిని ప్రశ్నించారు. మరో 8 శాతం మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 22 శాతం మంది ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకపోగా.. మరో 20 శాతం మంది ఆర్టికల్ 370 గురించి అవగాహన లేదని తెలిపారు.
Also Read: రామేశ్వరం కేఫ్ నిందితులు అరెస్టు..
G-20 సదస్సుపై ప్రజల అభిప్రాయం
2023 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం G-20 ససదస్సుకు నాయకత్వం వహించింది. అయితే దీని గురించి అడిగినప్పుడు G-20పై తమకు ఎలాంటి అవగాహన లేదని 63 శాతం మంది ఓటర్లు తెలిపారు. మిగతా 37 శాతం మంది మాత్రమే దీని గురించి విన్నట్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అప్పట్లో ఈ సదస్సుపై విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశాయి. ఈ సమావేశం కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిందని ఆరోపించాయి. G-20లో ఉన్న దేశాలకు ప్రతీఏడాది ఈ సమావేశానికి నాయకత్వం వహించే అవకాశం వస్తుందని.. ఈసారి వచ్చిన అవకాశాన్ని మోదీ ప్రభుత్వం ఎన్నికల కోసం తామే ఈ సదస్సు నిర్వహించినట్లు గొప్పలు చెప్పుకుందని విమర్శించారు.
అయితే ఈ జీ-20 గురించి అవగాహన ఉన్నవారని ప్రశ్నించగా.. ఇందులో 30 శాతం మంది ఓటర్లు సానుకూలంగా స్పందించారు. భారత్ అభివృద్ధిని చాటిచెప్పేందుకు ఈ సదస్సు ఉపయోగపడిందని తెలిపారు. మరో 23 శాతం మంది.. ఈ సదస్సు దేశంలో విదేశీ వ్యాపారాన్ని, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని చెప్పారు. 16 శాతం మంది ప్రభుత్వం సాధించిన విదేశీ విధాన విజయంగా భావించగా.. మరో 12 శాతం మంది డబ్బులు వృథాగా ఖర్చు పెట్టారంటూ పేర్కొన్నారు. మరో 10 శాతం మంది దీన్ని రాజకీయంగా మార్చుకున్నారంటూ తమ అభిప్రాయాన్ని చెప్పారు.
Also Read: అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తి..
యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమేనా ?
ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకే నిబంధనలతో అన్ని మతాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ఈ యూసీసీ (UCC)ని కొందరు సమర్థించగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మోదీ సర్కార్ ఈ బిల్లును అమలుచేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఉత్తరాఖాండ్‌లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. అయితే లోక్‌నీతి సంస్థ దీనిపై ఓటర్లను ప్రశ్నించగా.. 31 శాతం మంది ఓటర్లు యూనిఫామ్ సివిల్ కోడ్ మహిళలో సాధికారతను తీసుకొస్తుందని చెప్పారు. మరోవైపు ముస్లి ఓటర్లు దీనిపై సందేహం వ్యక్తం చేశారు. 29 శాతం మంది ముస్లింలు యూసీసీ అనేది మతాల ఆచారాలకు అంతరాయం కలిగిస్తుందని చెప్పారు. 25 శాతం మంది క్రైస్తవులు.. ఇది మహిళా సాధికారతకు దారి తీస్తుందని తెలిపారు.
భారత్ హిందువులకు మాత్రమే సొంతమా ?
బీజేపీ అంటేనే మతం ఆధారంగా రాజకీయాలు చేస్తుందన్నేది అందరికీ తెలిసిన విషయమే. హిందువుల ఓట్ల ఆధారంగానే అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే దీనికి మతపరమైన విషయంలో లోక్‌నీతి సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. భారత్ అన్ని మతాలకు చెందిన దేశమని.. కేవలం హిందువులకి మాత్రమే కాదని 79 శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 11శాతం మంది మాత్రం ఇండియా కేవలం హిందువుల సొంతమని అన్నారు. మరో 10 శాతం మంది ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు. ఇదిలాఉండగా.. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరి బీజేపీ ఈసారి ఎన్ని స్థానాల్లో గెలుస్తోందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.