/rtv/media/media_files/2025/10/22/mutton-2025-10-22-09-09-41.jpg)
జగిత్యాల జిల్లా ఎర్దండిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త జంట.. ప్రాణాలు తీసుకుంది. నెల రోజులు గడవకముందే ఇద్దరు తనువు చాలించి వారి కుటుంబ సభ్యుల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు సంతోష్ (26) , గంగోత్రి (22) ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి గతనెల సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన కేవలం ఆరు రోజులకే దసరా పండుగ రోజున (అక్టోబర్ 2న) గంగోత్రి అత్తవారి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
పెళ్లైన తరువాత వచ్చిన మొదటి పండగ కావడంతో దసరా రోజు తన భార్యతో కలిసి అత్తింటికి వెళ్లాడు సంతోష్.. అయితే అక్కడ రాత్రి భోజనం చేస్తున్న సమయంలో మటన్ కూరలో కారం ఎక్కువైందని భార్యను గట్టిగా మందలించాడు సంతోష్.. దీంతో మనస్తాపానికి గురైన గంగోత్రి అదే రోజు రాత్రి తన అత్తింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది జరిగిన 19 రోజులకు సంతోష్ కూడా తనువు చాలించాడు. ఎంతో ఇష్టంగా ప్రేమించి, పెళ్లాడిన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయిన సంతోష్ తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఆమె ఆలోచనలతో కుమిలిపోయాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో
వారం రోజుల కిందట ఆదిలాబాద్ లో ఉండే తన అక్క వద్దకు వెళ్లగా.. అక్కడ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. పెళ్లయిన నెల రోజుల వ్యవధిలోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఎర్దండి గ్రామంలో తీవ్ర విషాదం ఛాయలు అలుముకున్నాయి.