US police: అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి

కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ తెలంగాణ టెక్కీని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. మహమ్మద్ నిజాముద్దీన్ (32) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు సెప్టెంబర్ 3న కాల్చి చంపగా, ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు రెండు వారాల తర్వాత తెలిసింది.

New Update
telangana man

అగ్రరాజ్యంలో రోజురోజుకు హింస, దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవలకాలంలో సోషల్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. మరోసారి అమెరికాలో  విషాద ఘటన చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ తెలంగాణ టెక్కీని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. మహమ్మద్ నిజాముద్దీన్ (32) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు సెప్టెంబర్ 3న కాల్చి చంపగా, ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు రెండు వారాల తర్వాత తెలిసింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన కుటుంబం.. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సహాయం కోరింది.

మహబూబ్‌నగర్ జిల్లా రామయ్య బౌలికి చెందిన నిజాముద్దీన్ 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. తొలుత ఫ్లోరిడాలో చదువుకున్న అతను తర్వాత శాంటాక్లారాలో స్థిరపడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కొందరు స్నేహితులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. సెప్టెంబర్ 3న తన రూమ్‌మేట్‌తో జరిగిన చిన్న గొడవ కారణంగా అతనిపై  కత్తితో దాడికి దిగాడు నిజాముద్ధీన్. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు నిజాముద్దీన్ కత్తితో బెదిరిస్తుండగా తమను రక్షించుకోవడానికి కాల్పులు జరిపామని శాంటాక్లారా పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించగా, అతని మృతదేహం స్థానిక ఆసుపత్రిలో ఉందని పోలీసులు తెలిపారు.

అయితే, నిజాముద్దీన్ తండ్రి హుస్నుద్దీన్ పోలీసుల కథనాన్ని ఖండించారు. తన కొడుకును పోలీసులు ఎందుకు కాల్చి చంపారో తెలియడం లేదని, దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ద్వారా వెంటనే చర్యలు తీసుకొని, తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సహాయం చేయాలని కోరారు. మృతదేహం స్వదేశానికి వచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మజ్లిస్ బచావోతహ్రీక్ (MBT) నేత అంజద్ ఉల్లా ఖాన్ కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు.

ఘటనతో నిజాముద్దీన్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ కుమారుడిని చివరిసారి చూసుకోవడానికి, స్వదేశంలో అంత్యక్రియలు నిర్వహించడానికి తగిన సహాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతదేహాన్ని స్వదేశానికి తరలించే అంశంపై భారత ప్రభుత్వం అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషాద ఘటనపై అమెరికా తెలుగు కమ్యూనిటీలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisment
తాజా కథనాలు