Rajanna Siricilla :
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్‌లో జరుగుతున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా పీఈటీ జోష్ణ తమను వేధిస్తుందంటూ విద్యార్థులు రోడ్డుకెక్కారు. గురువారం ఉదయం 5 గంటలకే సిరిసిల్ల- సిద్దిపేట ప్రధానరహాదారిపై నిరసనకు దిగారు. ముఖ్యంగా పీరియడ్స్ టైమ్‌లో కావాలని వేధింపులకు గురిచేస్తోందని, బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకు అవుతుందంటూ డోర్ పగుల గొట్టి వీడియోలు తీస్తూ సైకోలాగా వ్యవహరిస్తుందని బాలికలు కన్నీరు పెట్టుకున్నారు.
అంతేకాదు ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ.. ఎక్కడపడితే అక్కడే కొడుతుందని వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాలలో జోష్ణ పీఈటీ విధులు నిర్వర్తిస్తోంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న పీఈటీ జోష్ణ రక్తం వచ్చేలా కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు ప్రిన్సిపల్‌తో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 580 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల, కళాశాలలో కనీస వసతులు కూడా లేవని వాపోతున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈవో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో వెంటనే పీఈటీ జోష్ణను విధుల నుంచి తప్పించారు ఎంఈవో రఘుపతి.
Also Read : నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం రేవంత్!