/rtv/media/media_files/2025/08/17/noor-mohammad-2025-08-17-18-14-08.jpg)
ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయి జిల్లా, ధర్మవరంలో ఆగస్ట్ 14న పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకున్న వ్యక్తి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై నూర్ మహమ్మద్ షేక్(40)ని ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీసులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడనే పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. స్థానికంగా ఒక బిర్యానీ సెంటర్‌లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ మహమ్మద్, బయటకు సాధారణ వ్యక్తిలా జీవిస్తూ, లోపల మాత్రం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నూర్ మహమ్మద్ పాకిస్థాన్‌లోని జైష్-ఎ-మహ్మద్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన 37 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ గ్రూపుల ద్వారా అతడు ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తూ, యువతను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. పోలీసులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించి, మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులు, ఉర్దూ భాషలో ఉన్న ఉగ్రవాద సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కొన్నాళ్ల క్రితం రోజు కూలీగా జీవనం సాగించే నూర్ మహమ్మద్, ఇటీవల ధర్మవరంలో ఒక కొత్త ఇంటిని నిర్మించుకోవడం పోలీసులకు అనుమానం కలిగించింది. ఈ ఇంటి నిర్మాణానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నూర్ మహమ్మద్ వివాహం చేసుకున్నప్పటికీ, భార్యతో విడిపోయి తల్లి, చెల్లెలితో కలిసి ఉంటున్నాడు. తాడిపత్రికి చెందిన ఓ మహిళతో అతనికి ఉన్న వివాహేతర సంబంధం కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ మహిళ పాత్రపైనా దృష్టి సారించారు.
పోలీసులు నూర్ మహమ్మద్‌పై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, కదిరి కోర్టులో హాజరుపరచగా, అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం, అతడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు.