/rtv/media/media_files/2025/11/03/mp-2025-11-03-08-16-42.jpg)
అత్యవసర చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తున్న రోగి అంబులెన్స్ టైర్ పంక్చర్ కావడంతో మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్రమైన నొప్పి, అధిక రక్తపోటుతో బాధపడుతున్న 65 ఏళ్ల జగదీష్ ఓజా అనే రోగిని మెరుగైన చికిత్స కోసం మైనా హెల్త్ సెంటర్ నుండి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. రోగిని తరలిస్తున్న ప్రభుత్వ అంబులెన్స్ జాతీయ రహదారి-46పై ప్రయాణిస్తుండగా టైర్ పంక్చర్ అయింది.
స్పేర్ టైర్ లేకపోవడంతో
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ అంబులెన్స్‌లో స్పేర్ టైర్ (స్టెప్నీ) లేదు. స్పేర్ టైర్ లేకపోవడంతో అంబులెన్స్ సుమారు గంటసేపు రోడ్డు పక్కనే నిలిచిపోయింది. దీని కారణంగా రోగిని సకాలంలో జిల్లా ఆసుపత్రికి తరలించలేకపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయంగా వేరే వాహనాన్ని ఏర్పాటు చేసుకుని ఆసుపత్రికి చేరుకునే సమయానికి అప్పటికే రోగి మరణించినట్లుగా డాక్టర్లు వెల్లడించారు.
ఈ ఘటనపై రోగి కుమారుడు మాట్లాడుతూ, అంబులెన్స్ ఆలస్యంగా రావడం, ఆపై టైర్ పంక్చర్ అయినప్పుడు స్పేర్ టైర్ లేకపోవడం స్పష్టమైన నిర్లక్ష్యం అని ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రిషి అగర్వాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఆసుపత్రిని సందర్శించి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్య శాఖలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, రూ. 600 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయని, దీనిపై తక్షణమే దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆ వాహనంలో తాను మొదటి రోజు అని, దానిలో స్పేర్ టైర్ ఉందో లేదో తనకు తెలియదని అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు.
 Follow Us