/rtv/media/media_files/2026/02/28/odisha-2026-02-28-21-07-36.jpg)
ఒడిశాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరు, సాయం చేస్తానని మరొకరు ఒకే రోజు ఒక యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. చివరకు ఆ యువతిని భవనం పైనుంచి కిందకు తోసేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
గుడిలో పెళ్లి చేసుకుందామని
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 22న ఒక 23 ఏళ్ల యువతి తన ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. గుడిలో పెళ్లి చేసుకుందామని అతను నమ్మించడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే, ఆ వ్యక్తి ఆమెను ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను రహమా బస్టాండ్‌లో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు.
తన అద్దె ఇంట్లోకి తీసుకెళ్లి
దిక్కుతోచని స్థితిలో బస్టాండ్‌లో ఉన్న ఆ యువతిని చూసి, జార్ఖండ్‌కు చెందిన మరో వ్యక్తి సాయం చేస్తానని నమ్మబలికాడు. మోటార్ సైకిల్‌పై వెళ్తున్న అతను ఆమెను తన అద్దె ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ భవనం పైకప్పు మీద ఆమెపై మళ్ళీ అత్యాచారానికి పాల్పడ్డాడు. తన పాపం బయటపడుతుందనే భయంతో, ఆ యువతిని భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని
ఈ ఘటనపై రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. పసిపిల్లల నుంచి వికలాంగుల వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవుతోందని విమర్శించారు. నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చేసి, మహిళలకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారిపై కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. దీనిని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది.
Follow Us