/rtv/media/media_files/2025/10/04/jagital-2025-10-04-08-10-49.jpg)
ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జంట కూడా చూడ ముచ్చటగా ఉంది. పది కాలల పాటు పచ్చగా ఉండాల్సిన వీరి సంసారం వారం రోజులకే ముగిసిపోయింది. చిన్నగా జరిగిన లొల్లి చివరకు విషాదంగా మారింది. మనస్పర్థలతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో విషాదం నింపింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులోని ఒడ్డెర కాలనీకి చెందిన అల్లెపు గంగోత్రి(22), అదే కాలనీకి చెందిన సంతోష్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
పెద్దల సమక్షంలో వీరిద్దరికి సెప్టెంబరు 26న పెళ్లి కూడా అయింది. పెళ్లయ్యాక వచ్చిన తొలి పండగ దసరా కావడంతో అక్టోబరు 2న గంగోత్రి భర్తతో కలిసి పుట్టినింటికి వచ్చింది. అయితే ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో ఇంట్లో వాళ్లుసర్ది చెప్పడంతో అక్కడ సైలెంట్ అయిపోయారు. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు సహజమేనని, ఆ గొడవ అంతటితో సమసిపోయిందని అంతా భావించారు. కానీ అదే శాపమైంది.
అనంతరం సంతోష్ భార్యతో కలిసి తన ఇంటికి వెళ్లిపోయాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గంగోత్రి ఎంతో మదనపడింది. ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా భర్తతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురవడం, అత్తింట్లో ఏదైనా జరగడం వల్ల తన కూతురు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని మృతురాలి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గంగోత్రి ఆత్మహత్యతో ఇరుకుంటుబాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.
రాజన్న-సిరిసిల్లలో తల్లి కూతురు అదృశ్యం
రాజన్న-సిరిసిల్లలో యల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి నుండి ఒక మహిళ, ఆమె కుమార్తె తప్పిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆలకుంట సుమలత 2020లో కథలాపూర్ మండలం చింతకుంటకు చెందిన లక్ష్మణ్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నిషిత అనే కుమార్తె ఉంది. ఆగస్టు 27న, సుమలత తన కుమార్తె నిషితతో కలిసి రాచర్లగొల్లపల్లిలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు, ఆమె తన కుమార్తెతో కలిసి ఎవరికీ చెప్పకుండా తన తల్లి ఇంటి నుండి వెళ్లిపోయింది. సమీప ప్రాంతాలను శోధించి, బంధువులతో విచారణ చేసిన తర్వాత, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను...భర్త గొడ్డలితో నరికి
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను...భర్త గొడ్డలితో నరికి చంపిన దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరులో జరిగింది. చీకటి నరేష్ , స్వప్న కల్లుగీత, చికెన్ దుకాణం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఇంటికి ఆలస్యంగా రావడంతో తండ్రికుమారుల మధ్య వాగ్వాదం జరిగింది. కుమారుడిపై గొడ్డలితో దాడికి యత్నించగా.. అతడు తప్పించుకొని బయటకు వెళ్లిపోయాడు. అనంతరం కుమారుడిని వెనుకేసుకొస్తుందని భార్యతో గొడవకు దిగాడు. ఘర్షణ తీవ్రమై నరేష్ ... స్వప్నపై గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.