/rtv/media/media_files/2025/11/11/syamala-2025-11-11-11-49-08.jpg)
వివాహమై ఏడాది కూడా తిరగకముందే కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన గోపాలపట్నం పరిధిలోని జీవీఎంసీ 91వ వార్డు రామకృష్ణనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతురాలి భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబరు 6న చోడవరం మండలం గోవాడ పంచాయతీకి చెందిన వేపాడ దిలీప్ శివకుమార్‌తో అచ్యుతాపురం వాసి విజయశ్యామల (25)కు వివాహమైంది.
పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు సమర్పించారు. ఉద్యోగరీత్యా దిలీప్, శ్యామల గత కొన్ని నెలలుగా రామకృష్ణనగర్‌లో నివాసం ఉంటున్నారు. దిలీప్ శివకుమార్ గత కొద్ది నెలలుగా అదనపు కట్నం కోసం శ్యామలను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. భర్త ఇంట్లో లేని సమయం చూసి, ఆదివారం అర్ధరాత్రి శ్యామల ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో పశ్చిమ ఏసీపీ పృధ్వీతేజ్, స్థానిక సీఐ లెంక సన్యాసినాయుడు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మృతురాలి ముఖంపై గాయాలు
పోలీసులు మృతదేహం పక్కన శ్యామల రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కూతురి ముఖంపై గాయాలు ఉన్నాయని గమనించిన ఆమె తల్లి రోజారమణి, కుటుంబీకులు, తమ కుమార్తెను అల్లుడే చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త దిలీప్ శివకుమార్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. తక్షణమే భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎంత పనిచేశావ్ శ్యామలా... అంటూ తల్లి రోజారమణి, కుటుంబీకులు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.
Follow Us