IPS ఆఫీసర్ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్..  DGPని అరెస్ట్ చేయాలని భార్య డిమాండ్

భర్త ఆత్మహత్యకు హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాలే కారణమని పురాణ్ కుమార్ భార్య ఆరోపించింది. వారిని తక్షణమే అరెస్టు చేయాలని IAS అధికారిణి అమ్నీత్ పి. కుమార్(పురాణ్ కుమార్ భార్య) డిమాండ్ చేశారు.

New Update
IPS Y Puran suicide case

హర్యానా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్త ఆత్మహత్యకు హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాలే కారణమని పురాణ్ కుమార్ భార్య ఆరోపించింది. వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి. కుమార్(పురాణ్ కుమార్ భార్య) డిమాండ్ చేశారు. అక్టోబర్ 7 చండీగఢ్‌లోని తమ నివాసంలో పురాణ్ కుమార్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో అమ్నీత్ కుమార్ విదేశీ పర్యటనలో ఉన్నారు. భారత్‌కు తిరిగి వచ్చిన ఆమె చండీగఢ్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు.

కుట్ర, వేధింపులే కారణం:
తన భర్త మృతి కేవలం ఆత్మహత్య మాత్రమే కాదని, సీనియర్ అధికారుల పక్షపాత, కుల వివక్షతో కూడిన వేధింపులే కారణమని ఆమె ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగానే తన భర్త తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని తెలిపారు. పురాణ్ కుమార్ మృతదేహం వద్ద లభ్యమైన తొమ్మిది పేజీల సూసైడ్ నోట్‌లో ఆయన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రస్తావించినట్లు సమాచారం. డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ ఆదేశాల మేరకు తనపై తప్పుడు కేసు బనాయించి, ఇరికించేందుకు కుట్ర పన్నారని తన భర్త తనకు ముందే చెప్పారని అమ్నీత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చనిపోవడానికి ముందు తన భర్త డీజీపీకి, ఎస్పీకి ఫోన్ చేసినా వారు స్పందించలేదని ఆరోపించారు.

ఎఫ్‌ఐఆర్ నమోదుకు డిమాండ్:
పురాణ్ కుమార్ ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను డీజీపీ, ఎస్పీలపై BNS సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అమ్నీత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఉన్నతాధికారులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆమె కోరారు. న్యాయం జరగాలని, తన పిల్లలకు సమాధానాలు కావాలని ఆమె భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన హర్యానా పోలీసు, పరిపాలనా వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు