/rtv/media/media_files/2025/10/07/ips-service-gun-2025-10-07-16-03-33.jpg)
IPS ఆఫీసర్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన చండీగఢ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. హర్యానా క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆయన ఇంట్లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సెక్టార్ 11లోని తమ నివాసంలో పూరణ్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందారు. కాల్పుల శబ్దం బయటకు వినిపించకుండా ఉండేందుకు ఆయన ఇంటి బేస్‌మెంట్‌లో ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. చాలాసేపటి తర్వాత ఆయన కూతురు బేస్‌మెంట్‌కు వెళ్లి చూడగా, తండ్రి మృతదేహం పడి ఉంది. ఆమె పోలీసులకు సమాచారం అందించారు.
Haryana cadre IPS officer Y Puran Kumar has shot himself dead at his house in Chandigarh.
— Man Aman Singh Chhina (@manaman_chhina) October 7, 2025
His wife is an IAS officer in the same cadre. pic.twitter.com/OSSunU5bAS
పూరణ్ కుమార్ భార్య, హర్యానా క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అయిన అమ్నీత్ పి. కుమార్ ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేరు. ఆమె ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో ఓ అధికారిక ప్రతినిధి బృందంతో కలిసి జపాన్ పర్యటనలో ఉన్నారు. వై. పూరణ్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన సర్వీస్ రివాల్వర్‌ను సోమవారం తన గన్‌మ్యాన్ నుండి తీసుకున్నట్లు తెలుస్తోంది. వై.పూరణ్ కుమార్ తన కెరీర్‌లో సీనియారిటీ, అంతర్గత వ్యవహారాలపై తరచుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని హోం మంత్రి అనిల్ విజ్‌కు కూడా పలుమార్లు లేఖలు రాశారని తెలుస్తోంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు ప్రారంభించారు. సీనియర్ పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడం ఉన్నతాధికారులను, సహోద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియనున్నాయి.