Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్ లోయలో పడి 8 మంది మహిళలు మృతి

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో ఎనిమిది మంది మహిళలు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా విషాదం నింపింది.

New Update
Pune hilly terrain

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో ఎనిమిది మంది మహిళలు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం పింప్రి చించ్‌వాడ్ పరిధిలోని పైత్ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. పాపల్వాడి గ్రామానికి చెందిన 30 నుంచి 35 మంది మహిళా భక్తులు, పిల్లలు శ్రావణ మాసం సందర్భంగా కేడ్ తహశీల్‌లోని శ్రీ క్షేత్ర మహాదేవ్ కుండేశ్వర్ ఆలయానికి వెళ్తున్నారు. వ్యాన్  ఘాట్ రోడ్డుపై వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం సుమారు 30 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు, అంబులెన్స్‌లకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ విషాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పికప్ వ్యాన్‌లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం, కొండ ప్రాంతంలో డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు