/rtv/media/media_files/2025/07/18/deepak-mahawar-died-after-being-bitten-by-snake-in-madhya-pradesh-2025-07-18-06-31-24.jpg)
Deepak Mahawar died after being bitten by snake in Madhya Pradesh
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ దీపక్ మహావర్ పాము కాటుకు గురై మరణించాడు. వేలాది పాములను రక్షించి, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో దీపక్ మహావర్ పేరుపొందాడు. ఎలాంటి డబ్బు తీసుకోకుండా ప్రజలకు సేవ చేసిన ఆయన మరణం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జూలై 14న దీపక్ మహావర్ రాఘోగఢ్ బర్బత్పురా గ్రామంలో ఒక ఇంట్లోకి ప్రవేశించిన నల్లత్రాచు పామును పట్టుకోవడానికి వెళ్లాడు. పామును విజయవంతంగా పట్టుకున్న తర్వాత, తన కుమారుడి స్కూల్ ముగిసిందని ఫోన్ రావడంతో హడావుడిగా ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో అతను పట్టుకున్న పామును తన మెడకు చుట్టుకుని బైక్‌పై వెళ్తూ.. ఫొటోలకు పోజులు ఇచ్చాడు. అదే సమయంలో అది అతని చేతిపై కాటు వేసింది.
A Snake charmer from Madhya Pradesh Deepak Mahabar died after a rescued snake he was carrying around his neck bit him.
— काश/if Kakvi (@KashifKakvi) July 17, 2025
He was going to drop his daughter to school with snake when it bit him.pic.twitter.com/lqPyyKDhpE
వైద్య చికిత్స
పాము కాటు వేసిన వెంటనే అప్రమత్తమైన దీపక్.. తన స్నేహితులకు ఫోన్ చేసి రఘోఘర్ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, మెరుగైన వైద్యం కోసం గుణ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సాయంత్రానికి అతని ఆరోగ్యం కొంత మెరుగుపడినట్లు కనిపించడంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. అయితే, అదే రాత్రి అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు తిరిగి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు తెల్లవారుజామున (జూలై 15న) అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సేవ, గుర్తింపు
దీపక్ మహావర్ దాదాపు పదేళ్లకు పైగా పాములను పడుతున్నాడు. ఎవరి ఇంట్లోనైనా లేదా కార్యాలయంలో పాము ఉందని ఫోన్ వస్తే, వెంటనే వెళ్లి ఉచితంగా పామును పట్టి, దానిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేవాడు. అతని సేవలకు గాను ప్రజల్లో అతనికి మంచి పేరు ఉంది. జేపీ యూనివర్సిటీలో కూడా అతను స్నేక్ క్యాచర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది.
దీపక్ మహావర్ మరణం పాములు పట్టే వారికి ఒక గుణపాఠంలాంటిదని, ఎంత అనుభవం ఉన్నవారైనా విషపూరిత పాములతో వ్యవహరించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీపక్‌కు రౌనక్, చిరాగ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి తల్లి గతంలోనే మరణించడంతో ఇప్పుడు వారు అనాథలుగా మారారు.