/rtv/media/media_files/2025/10/16/barmer-balotra-road-accident-2025-10-16-11-19-45.jpg)
barmer balotra road accident
రాజస్థాన్‌లో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. రెండు రోజుల క్రితం జైసల్మేర్‌లో జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా మరణించిన విషాదం మరువకముందే.. తాజాగా గురువారం తెల్లవారుజామున బార్మర్ జిల్లాలోని గుడామలానీ ప్రాంతంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కార్పియో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
బాలొత్రా-సింధారి మెగా హైవేపై సడా సరిహద్దు ప్రాంతంలో తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గుడామలానీలోని డాబడ్ గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు సింధారిలో ఒక హోటల్‌లో భోజనం చేసి, స్కార్పియో కారులో తిరిగి ఇంటికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రైలర్‌ను ఢీకొట్టింది.
बालोतर में टेलर व स्कॉर्पियो में आमने-सामने टक्कर से दोनों वाहनों में भीषण आग लग गई. हादसे में स्कार्पियो में चार लोगों की ज़िंदा जलनें से मौत हो गई. जबकि एक युवक गंभीर रूप से घायल है.#Rajasthan#RoadAccident#ATReel#AajTakSocialpic.twitter.com/ljUhZSptnX
— AajTak (@aajtak) October 16, 2025
మంటల్లో చిక్కుకున్న యువకులు:
ట్రైలర్, స్కార్పియో మధ్య ప్రమాదం చాలా తీవ్రంగా జరగడంతో వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో, స్కార్పియో కారు తలుపులు జామ్ అయ్యాయి. దీంతో కారులో ఉన్న నలుగురు యువకులు బయటకు రాలేకపోయి, మంటల్లో చిక్కుకొని ఘోరంగా సజీవ దహనమయ్యారు. అయితే స్కార్పియో డ్రైవర్ దలీప్ సింగ్ మాత్రం బయటకు రావడానికి ప్రయత్నించి బయటపడ్డాడు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ సుశీల్ కుమార్ యాదవ్, ఎస్పీ రమేష్ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సింధారి ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ దలీప్ సింగ్‌ను మెరుగైన చికిత్స కోసం జోధ్‌పూర్ రెఫర్ చేశారు.
మృతుల గుర్తింపు
మృతులను గుడామలానీకి చెందిన మోహన్ సింగ్ (35), శంభు సింగ్ (20), పంచారామ్ (22), ప్రకాష్ (28) గా గుర్తించారు. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. తమ పిల్లల కాలిపోయిన అవశేషాలను చూసి బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ హృదయ విదారక ఘటనతో గుడామలానీలోని డాబడ్ గ్రామంలో, పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. హైవేపై దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ వరుస ప్రమాదాలు రాజస్థాన్ రహదారుల భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి.